ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఐదుగురు వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ రాజీనామాలను లోక్ సభ స్పీకర్ వెంటనే ఆమోదించలేకపోయారు. గతవారంలో ఎంపీలతో సమావేశమై.. పునరాలోచించుకోవాలంటూ సమయం ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులకు లోబడి, భావోద్వేగాలు గురౌతూ రాజీనామాలు చేసినట్టు అర్థమౌతోందని స్పీకర్ చెప్పారు. సభాపతిగా వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ అప్పుడే చెప్పారు. సరే, రాజీనామాలపై భాజపా ఎందుకింత తాత్సారం చేస్తోందనేది అందిరికీ తెలిసిన రహస్యమే. అయితే, రాజీనామాల అంశమై ఒక కొత్త వాదనను వినిపించడం ఆశ్చర్యంగా ఉంది.
వైసీపీ ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించకపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు! భాజపాతో చంద్రబాబు కుమ్మక్కయ్యారనీ, తమ ఎంపీల రాజీనామాలను ఆమోదించకుండా అడ్డుపడ్డారని జగన్ విమర్శించడం విచిత్రంగా ఉంది! పార్టీలు మారిన ముగ్గురు ఎంపీలపై అనర్హత వేటు పడకుండా భాజపాతో మిలాకత్ అయి కుట్ర చేశారంటూ ఆరోపించారు. ఇదీ జగన్ కొత్త వాదన. ఇకపై దీన్నే ప్రధానంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది..!
నిజానికి, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఏపీ సర్కారు పోరాటానికి దిగితే, భాజపాతో సయోధ్యకి ప్రయత్నించింది ఎవరు..? వైకాపా ఎంపీలే కదా! ఢిల్లీలో టీడీపీ పోరాటం చేస్తుంటే… ప్రధాని కార్యాలయంలో మీటింగులూ, మీడియా ముందు ఏపీ సీఎంని విమర్శలకే పరిమితం అయ్యారు. ఈ సందర్భంలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు బాగా అర్థమైంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చిన తరువాత, భాజపాతో ఎలాంటి సంబంధాలు లేవన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకు భాజపా వైఖరే సాక్ష్యం.
ఇక, రాజీనామాల విషయానికొస్తే.. వైకాపా కూడా చాలా కన్వీనియంట్ గా చేసింది. రాజీనామాలు చేసిన వెంటనే నిరాహార దీక్షలంటూ ఎంపీలు స్పీకరుకు అందుబాటులో లేకుండాపోయారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజు వరకూ వేచి చూసి రాజీనామాలు చేశారు! స్పీకర్ కూడా వెంటనే పిలిచి వివరణ కోరి ఉంటే ఈపాటికి రాజీనామాల ఆమోదం జరిగిపోయేది. కానీ, చివరి రోజు కావడంతో ఆ అవకాశం లేదన్నట్టుగా పరిస్థితి కారణంగా చూపించారు. పైగా, ఉప ఎన్నికలు రాకుండా సాంకేతికంగా ఎంత జాగ్రత్తపడాలో వైకాపా అంతే జాగ్రత్త పడింది. ఇప్పుడు కూడా వారి రాజీనామాలు ఆమోదించడానికి వారంపైనే స్పీకర్ సమయం ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో కుమ్మక్కు కోణం వైకాపా-భాజపాల మధ్య కనిపిస్తోందా, భాజపా-టీడీపీల మధ్య కనిపిస్తోందా..?