తెలంగాణ కాంగ్రెస్ ఇన్నాళ్లకు వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. కాకపోతే, ఈ ప్రయత్నం ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందనీ చెప్పుకోవాలి..! సెటిలర్ల విషయంలో మొదట్నుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఉద్యమ సమయంలో సెటిలర్లకు ఉన్న భయాలన్నీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే ఒక్కోటిగా తొలగించుకుంటూ వచ్చారు. ఓరకంగా, సెటిలర్లంతా తెరాసవైపు ఆకర్షితులు కావడానికి చేయాల్సినవన్నీ కేసీఆర్, కేటీఆర్ లు చేసేశారనే చెప్పాలి. అయితే, ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సెటిలర్లపై కొత్తగా అభిమానం ప్రదర్శించే ప్రయత్నం మొదలుపెట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లిస్ నాయకుడు అసద్ లు కలిసి మోడీకి చంచాగిరీ చేస్తున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేసీఆర్, కేటీఆర్ లు కేవలం తుగ్లక్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారనీ, చేసిందేమీ లేదని విమర్శించారు. హైదరాబాద్ లోని సెటిలర్లను కేసీఆర్ అవమానించారనీ, ఆంధ్రా వాళ్లను తరమికొట్టాలంటూ నినదించారంటూ గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ ప్రాధన్యత ఇవ్వనుందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో కూడా సెటిలర్లకు సముచితం స్థానం కల్పించబోతున్నట్టు ఉత్తమ్ ప్రకటించారు. పాతబస్తీలోని అన్ని సీట్ల నుంచీ కాంగ్రెస్ పోటీకి దిగుతుందని ఉత్తమ్ అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల టిక్కెట్లలో కూడా సెటిలర్లకు సముచిత స్థానం కల్పిస్తామని ఉత్తమ్ చెప్పడం విశేషం. అయితే, ఇచ్చిన మాట ప్రకారం టిక్కెట్లలో ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి టీ కాంగ్రెస్ లో ఉంటుందా అనేదే కొంతమంది అనుమానం! ఎందుకంటే, ఇప్పటికే ఆ పార్టీలో నాయకుల తాకిడి ఎక్కువ. అరడజను సీఎం అభ్యర్థులున్నట్టుగానే, ఒక్కో సీటుకూ పోటీపడే వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటుంది. సో.. ఇలాంటప్పుడు, ప్రత్యేకంగా సెటిలర్లకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా అనేదే అనుమానం..? సరే, సీట్ల కేటాయింపుల మాట ఎలా ఉన్నా… సెటిలర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ చాలా ఆలస్యంగా స్పందిందిస్తోందనేది మాత్రం వాస్తవం. గతాన్ని గుర్తు చేయడం వల్ల ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ కి లబ్ధి చేకూరే అవకాశాలైతే తక్కువగానే ఉన్నాయి.