తెలుగు చలన చిత్రసీమలో ఇప్పటి వరకూ అయితే యుద్ధాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుంటారు. బాహుబలిలో వార్ సీన్లు… ఆ రేంజులో ఆకట్టుకున్నాయి. అదేదో హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలిగించాయి. ఇక మీదట యుద్ధ సన్నివేశాల్ని తీయాలంటే ‘బాహుబలి’ని రిఫరెన్స్‌గా తీసుకోవాల్సిందే. ఇప్పుడు ‘సైరా’ బాహుబలిని మించేలా వార్ సీన్లు రూపొందించాలన్న తపనలో ఉంది. ప్రస్తుతం వార్ ఎపిసోడ్ల రూపకల్పనకు రంగం సిద్ధం అవుతోంది. ఈ వారంలోనే హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో ‘సైరా’ వార్ ఎపిసోడ్లు తెరకెక్కించనున్నారు. సినిమాలో సగం బడ్జెట్ ఈ యుద్ధ సన్నివేశాలకే కేటాయించినట్టు తెలుస్తోంది. బాహుబలితో పోలిస్తే… ‘సైరా’లో యుద్ధాలు తక్కువే. కానీ ఉన్న ఒకట్రెండు సీన్లే అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తోంది.
సైరా కోసం ఇది వరకే ఓ యాక్షన్ ఎపిసోడ్‌ని షూట్ చేశారు. దాన్ని అంతర్జాతీయ నిపుణులతో విజువల్స్ ఎఫెక్ట్స్ జోడించారట. ఆ యాక్షన్ సీన్ చాలా బాగా వచ్చిందని, ఆ స్ఫూర్తితో ‘వార్ ఎపిసోడ్లు’ మరింత పకడ్బందీగా తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం. వార్ ఎపిసోడ్ల వరకూ బడ్జెట్ గురించి ఆలోచించొద్దని చిరు ముందే చెప్పేశాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.