యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షో సీజన్ 1 హోస్ట్ చేశాడు. సీజన్ 2ని నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి నాని షో స్టార్ట్ కానుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ షో అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. మరి, సీజన్ 2కి హోస్ట్ చేయనున్న నాని ఒత్తిడి ఏమైనా ఫీలవుతున్నాడా? అని అడిగితే… అవుననే చెప్పాడు. ‘షో ఎలా హోస్ట్ చేయాలనే విషయంలో ఎన్టీఆర్ నుంచి ఏవైనా టిప్స్.. సలహాలు… తీసుకున్నారా? అతణ్ణి కలిశారా?’ అని నానీని అడిగితే… “లేదు. ఎవరి దగ్గరా టిప్స్ తీసుకోవద్దని తారక్ (ఎన్టీఆర్) చెప్పాడు. ‘బిగ్ బాస్’కి సైన్ చేశాక… ‘మహానటి’ ఆడియోలో తారక్, నేనూ కలిశాం. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కొంతసేపు షో గురించి మాట్లాడారు. ఎవరి సలహాలు తీసుకోవద్దని చెప్పాడు” అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ ఏవీ చూడలేదని నాని తెలిపారు. త్వరలో అవన్నీ చూస్తానని అతడికి ప్రామిస్ చేశానన్నారు. నిజ జీవితంలో తాను ఎలా వుంటానో.. షోలోనూ అలాగే వుంటానని తెలిపారు.