హైదరాబాద్: నిన్న ఊరేగింపులో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై చేసిన తీవ్రవిమర్శలపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంతే స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రా పార్టీలకు తొత్తులాగా ఊడిగం చేస్తున్నాడని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, వందలాదిమంది విద్యార్థుల ఆత్మహత్యలకు టీడీపీయే కారణమని, వారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో రేవంత్ రెడ్డి పౌరుషం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మరోమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బెయిల్ వచ్చినంతమాత్రాన తప్పు ఒప్పుగా మారదన్నారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని, న్యాయస్థానంలో శిక్ష తప్పదని మంత్రులు జోస్యం చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్లో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తొడలుకొట్టి మీసాలు మెలేయటం సాక్షులను బెదిరించటమేనని అన్నారు.