ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని చదివి అమాయకంగా నమ్మేద్దామా? కళ్లముందు కనబడుతున్న పచ్చి రాచరిక పోకడలను చూసి ముక్కున వేలేసుకుందామా? రాజకీయ నాయకుడంటే చట్టాలకు అతీతుడని, అమాత్యుడైతే దైవంశ సంభూతుడని భావించే లీడర్స్ చాలా మందే ఉన్నారు. పారదర్శకతపై అపారమైన నమ్మకం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లోని వారూ ఇందుకు మినహాయింపు కాకపోవడం ఆశ్చర్యకరం.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కుటుంబం కోసం, విమానంలోంచి ముగ్గురు ప్రయాణికులను దింపేసిన సంఘటన మోడీ ఇమేజికి మచ్చ. లేహ్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానంలో టికెట్లు కొనుక్కుని కూర్చున ప్రయాణికులను హటాత్తుగా దిగాలని ఎయిరిండియా అధికారులు గద్దించారు. మంత్రిగారు, కుటుంబ సభ్యుల కోసం సీట్లు ఖాళీ చేయడం వారి డ్యూటీ. మేమెందుకు దిగాలని ప్రయాణికులు అడిగినా ప్రయోజనం లేదు. వారిని దింపేసి మంత్రిగారి సేవలో తరించారు. చివరికి ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఆ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విచారం వెలిబుచ్చారు.
చెన్నైలో డీఎంకే నేత స్టాలిన్ మరీ దారుణంగా ప్రవర్తించారు. మెట్రో రైల్లో తన పక్కన నిలబడిన ప్రయాణికుడి మీద అకారణంగా చేయి చేసుకున్నారు. మాజీ ఉఫ ముఖ్యమంత్రినైన నా పక్కన ఓ సామాన్యుడు నిలబడటమా అని కోపం వచ్చిందో, మరేమైందో తెలియదు గానీ, తన వీఐపీ రుబాబును ప్రదర్శించారు. రైల్లో నిలబడి ఉన్న ఆ ప్రయాణికుడు, హటాత్తుగా స్టాలిన్ చెంపమీద కొట్టేసరికి ఉలిక్కి పడ్డాడు. దూరంగా పో అని అతడిన స్టాలిన్ గదమాయించి పంపేశారు. ఓ ప్రయాణికులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఈ వీడియో ఆన్ లైన్లో చక్కర్లు కొట్టడంతో స్టాలిన్ గారు సంజాయిషీ ఇచ్చుకున్నారు. తానెవరినీ కొట్టలేదని, దూరంగా పొమ్మన్నానని అన్నారు. అసలు దూరంగా పొమ్మనడానికి ఆయనెవరు? రైలు ఆయన సొంతమా?
ఈ మధ్యే ఇలాంటి వీఐపీ అహంకారపు ఘటనలు అనేకం వెలుగు చూశాయి. చివరకు తన బూట్ల లేస్ ను కూడా గన్ మెన్ కట్టించుకున్న రాజకీయ నాయకుడి బాగోతాన్ని టీవీల్లో చూసి తరించాం. ఎవరి మీద పడిదే వారి మీద చేయి చేసుకోవడం, వీవీఐపీలమంటూ స్పెషల్ సౌకర్యాలు కోరడం, అవి లభించకపోతే రుబాబు చేయడం షరామామూలుగా మారింది.
బీజేపీ నాయకులు, మంత్రులు ఇప్పటికే చాలా మంది వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు కిరణ్ రిజిజు వ్వవహారం ఇంకా దుమారం రేపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు విదేశీ ప్రయాణం చేయాల్సిన అధికారి పాస్ పోర్ట్ మర్చిపోయారని విమానాన్ని నిలిపి వేయించారని మరో ఆరోపణ వచ్చింది. ఇంకా మనం ప్రభువులమే అని నమ్ముదామా? రాజకీయ నాయకులు దైవాంశ సంభూతులని దండం పెడదామా? వాళ్లనే అడుగుదాం !!