హైదరాబాద్: ముఖ్యమంత్రికోసం తెలంగాణ ప్రగతి రథం పేరుతో రు.5 కోట్ల ఖర్చుతో బస్సు కొనుగోలు చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేననికాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. కేసీఆర్‌కు ఎవరినుంచీ ప్రాణహాని లేదని, అలాంటప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ రు.5 కోట్లను పేదలకోసం ఖర్చు చేయొచ్చు కదా అన్నారు. వీహెచ్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని కలిశారు. డీఎస్ రాజీనామా, తెలంగాణలో పార్టీ పరిస్థితులువంటి తాజా పరిణామాలను ఆమెకు వివరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వీహెచ్, డీఎస్ పచ్చి అవకాశవాది అని, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడకు వెళ్ళి వాలిపోతారని అన్నారు. ఆయన పార్టీ వీడటంవల్ల నష్టమేమీ లేదని చెప్పారు.
కేసీఆర్ కోసం రు.5 కోట్లతో రూపొందిన ఈ బస్సును చండీగఢ్‌లోని ఓ కంపెనీ తయారు చేసింది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ బస్సును ఆ కంపెనీ బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చటమేకాక, లోపల పడకగది, బాత్రూమ్, చిన్న సమావేశ మందిరం, వైఫై వంటి సౌకర్యాలనుకూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సు నిన్న హైదరాబాద్ చేరుకుంది.