హైదరాబాద్: బుధవారంనాడు చర్లపల్లి జైలునుంచి విడుదలై బయటకొచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లను తీవ్రపదజాలంతో దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. పేర్లు ప్రస్తావించకుండా విమర్శలు చేసిన రేవంత్, కేసీఆర్‌ను చుక్కపడనిదే నిద్ర లేవడని, హరీష్‌ను లంబూగాడికి మెదడు మోకాలులో ఉంటుందని, తలసానిని సిగ్గూ, శరం ఉంటే టీడీపీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నిన్న పలువురు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు ప్రతిస్పందించారు. రేవంత్ స్థాయిలోనే ప్రతివిమర్శలు గుప్పించారు. రేవంత్‌కు బెయిల్ మాత్రమే వచ్చిందని, శిక్ష తప్పదని అన్నారు. అయితే తీవ్రంగా తిట్టించుకున్న కేసీఆర్, హరీష్ రావపు, తలసానిమాత్రం స్పందించకపోవటం విశేషం. ముఖ్యంగా కేసీఆర్ నిన్న రంజాన్ సందర్భంగా ముస్లిమ్‌లకు వరాలు ప్రకటించటానికి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ విమర్శలపై స్పందిస్తారని అందరూ భావించినప్పటికీ ఆయన ఆ విషయంపై నోరు మెదపలేదు. మరోవైపు హరీష్, తలసానికూడా మౌనాన్నే ఆశ్రయించారు.