హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో వాదించటంకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రఖ్యాత న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ కేసులో ఇంకా సాక్షులను విచారించాల్సిఉందని సిబల్ వాదించారు. అరెస్టయిన ఒక్కరోజులో బెయిల్ వస్తే పరిశీలించాలని, కానీ నిందితుడు 30 రోజులు జెయిల్లో ఉన్నాడని న్యాయమూర్తి అన్నారు. సెక్షన్ 164కింద వాంగ్మూలం రికార్డ్ చేశారనికూడా గుర్తు చేశారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. రేవంత్ తరపున మరో ప్రముఖ న్యాయవాది రాంజెత్మలాని వాదించారు.
మరోపైపు రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయటం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని తెలుగుదేశం తెలంగాణ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలు అన్ని కార్యక్రమాలూ నిలిపేసి రేవంత్ రెడ్డి కేసును సింగిల్ పాయింట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.