పదో షెడ్యూలు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా వున్న ఉమ్మడిసంస్ధలను తెలంగాణకే విడిచి పెట్టేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గవర్నర్ ద్వారా ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఇందుకోసం వెయ్యకోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ప్రతిపాదన చేయబోతున్నారని తెలిసింది.
తెలంగాణలోని ఉమ్మడి కార్యాలయాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభాగాల ఉద్యోగులకు తరచూ అవమానాలు ఎదుర్కొనాల్సిన పరిస్ధితి నెలకొనిఉంది. ఆయా సంస్ధల విభజన జరిగేవరకూ ఈపరిస్ధితిని ఎదుర్కునేకంటే సంస్ధలను ఇపుడే వదులుకుని కొంత పరిహారంతీసుకుంటే ఆసొమ్ము తో స్వరాష్ట్రంలోనే సంస్ధలను నిర్మించకోవచ్చని ఏపీ ఉద్యోగవర్గాలు సూచిస్తున్నాయి. అయితే, ప్రత్యేక హోదావంటి హక్కుల సాధనకోసం కోసం ఉద్యమించవలసిన ప్రస్తుత స్ధితిలో ఈ ప్రతిపాదన చేస్తే మిగిలిన డిమాండ్లు బలహీనమవుతాయి కాబట్టి ప్రభుత్వ స్ధాయిలో ఇప్పటికిప్పుడే ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకురాలేమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగవర్గాల నాయకులకు చెప్పారని తెలిసింది.
దీంతో అధికారస్ధాయిలోనే లాబీయింగ్ చేయాలని ఉద్యోగవర్గాలు నిర్ణయించుకున్నాయి. గవర్నర్ నరశింహన్ ఒకనాడు బ్యూరోక్రాట్ అయివుండటం వీరికి అనుకూలించేవిషయం. అదీకాక, ఇద్దరు ముఖ్యమంత్రుల కీచలాటలతో తలబొప్పులు కట్టిన గవర్నర్ కు ఇలాంటి రాజీ మార్గాలు ఎంతైనా నచ్చుతాయి. ఆయన కేంద్రహోంశాఖ ముందు ఈ సూచన వుంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
10 వషెడ్యూలులో దాదాపు అన్నిసంస్ధల కార్యాలయాలు హైదరాబాద్ లోనే వుండటం వల్ల వాటిని వదులుకోవడం తప్ప ఏపీకి గత్యంతరం లేదుకనుక పరిహారం ఇచ్చి వాటిని సొంతం చేసుకోనవసరంలేదన్న భావన కెసిఆర్ సహా తెలంగాణానాయకులకు సహజంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా ఈ ప్రతిపాదన వస్తే తెలంగాణా ప్రభుత్వం అంగీకరించదు. అయితే కేంద్ర హోంశాఖనుంచో, గవర్నర్ నుంచో ఈ సూచన వస్తే తిరస్కరించడం అంత సుళువుకాదు. వెయ్యికోట్లు కాకపోయినా ఎంత పరిహారం వచ్చినా అది ఆంధ్రప్రదేశ్ కి ఇపుడు అవసరమే..