కోల్ కతాలో జరిగిన మహా ర్యాలీకి దేశంలోని దాదాపు ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలందరూ వెళ్లారు. నిజానికి, ఈ ర్యాలీకి రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం ఉన్న ర్యాలీకి తాను రాలేనని చెప్పారు. జాతీయ రాజకీయాల ఆలోచన బయటపెట్టిన దగ్గర్నుంచీ కేసీఆర్ చెబుతున్నది ఒక్కటే… కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపాయేతరం అనే వాదనకు బాగా మద్దతు లభిస్తున్న పరిస్థితి కోల్ కతాలో చూశాం. కానీ, దాంతోపాటు కాంగ్రెసేతరం అనే అభిప్రాయానికే రానురానూ బలం తగ్గుతున్న పరిస్థితికి పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ ర్యాలీ వేదిక అయిందనీ చెప్పొచ్చు.
భాజపాకి వ్యతిరేకంగా పార్టీల కూటమి అనగానే అది కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉంటుందనే అభిప్రాయమే అందరికీ ఉండేది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన రోజు కావొచ్చు, కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా జరిగిన సభలో కావొచ్చు… ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతాయన్నట్టుగానే కనిపించింది. ఆ తరువాత, కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ అనే చర్చ కూడా తెరమీదికి రావడం… దాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలే ఖండించడం కూడా చూశాం. అయితే, కోల్ కతా సభకి వచ్చేసరికి ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఫ్రెంట్ లో కాంగ్రెస్ ఒక భాగస్వామి పార్టీ అన్నట్టుగా వ్యవహరించింది. అంతేగానీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఉంటుందనే అభిప్రాయమైతే కలగలేదు.
భాజపా వెర్సెస్ ప్రాంతీయ పార్టీల కూటమి… లోక్ సభ ఎన్నికల పోరు వీటి మధ్యే అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తృతీయ ప్రత్యామ్నాయానికి ఆస్కారం ఉంటుందా అనే అభిప్రాయమూ కలుగుతోంది. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న భాజపాయేతర కూటమి ఇదే! ప్రాంతీయ పార్టీల కూటమిలో కాంగ్రెస్ భాగమౌతున్నప్పుడు… కాంగ్రెస్ నేతృత్వం అనే ఆలోచనకే ప్రాధాన్యత తగ్గుతున్నప్పుడు… ప్రాంతీయ పార్టీల సమష్టి నాయకత్వంలో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్ సిద్ధమౌతున్నప్పుడు… మూడో ప్రత్యామ్నాయం అవసరం కనిపించదు కదా. ఈ లెక్కన కేసీఆర్ చెప్తున్న కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రతిపాదనకు బలం ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ చెప్తున్న ప్రాంతీయ పార్టీల కూటమే ఇప్పుడు భాజపాకి వ్యతిరేకంగా బలపడుతున్న పరిస్థితి. కాకపోతే, దాన్లో కాంగ్రెస్ కూడా ఒక పార్టీగా మారుతున్న పరిస్థితి. ఈ లెక్కన కాంగ్రెసేతరం అనే కేసీఆర్ సిద్ధాంతానికి బలం తగ్గున్నట్టే కదా.