వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని… ఇతర జాతీయ పార్టీలు లేశ మాత్రంగా కూడా ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు..? కనీసం. ఓ కూటమిలో కలుద్దామని కూడా ఎందుకు ప్రతిపాదించడం లేదు..? కోల్‌కతా లాంటి విపక్ష ర్యాలీలకు.. మాట మాత్రంగా పిలిచే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు..? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. దీనికి… ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్తపలుకు ఆర్టికల్‌లో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిగతా ఎవరికీ… జగన్మోహన్ రెడ్డి అవసరం లేనే లేదని.. ఆయన అవసరం.. ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉందని తేల్చారు. ” ప్రధానమంత్రి పదవిపై రాహుల్‌గాంధీ, మాయావతి, మమతాబెనర్జీ వంటివారు ఆశలు పెట్టుకున్నందున కుదిరితే ఉపప్రధాని కావాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. తన కోర్కె నెరవేరాలంటే ఏపీలో జగన్మోహన్రెడ్డికి అత్యధిక ఎంపీ స్థానాలు దక్కాలి. అందుకోసం అవసరమైన మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఆర్థికంగా అండదండలు అందించడానికి కేసీఆర్ అండ్ కో ఒక నిర్ణయానికి వచ్చారు” అని ఆర్కే రాసుకొచ్చారు.
ఇటీవల పరిణామాలపై.. ఆర్కే తనదైన లాజిక్‌తో.. కొన్ని రాజకీయ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌తో కలవడం వల్ల..జగన్‌కు వచ్చే లాభం ఏమిటి..? నష్టం ఏమిటి..? అన్న తీరును వివరించారు. ఏ విధంగా చూసినా.. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి జరిగితే నష్టం జరగాలి కానీ.. కొత్తగా.. ఒక్క ఓటు కూడా.. కలసి రాదు. అదే..ఏ మాత్రం ప్రజల్లో సెంటిమెంట్ రగిలినా అది వైసీపీని తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇలాంటి అవకాశాల్ని ఏ పార్టీ వదులుకోదని.. దానికి సంబంధించి ఇప్పటికే.. టీడీపీ కార్యాచరణ ప్రారంభించిందని ఆర్కే వివరించారు. జరగబోయేది కూడా అదేనన్న అభిప్రాయం.. రాజకీయవర్గాల్లో ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ కేసీఆర్‌కు మాత్రం లాభం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నష్టపోయినా… కేసీఆర్‌కు పోయేదేమీ లేదు. కానీ గెలిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. అందుకే.. కేసీఆర్ చొరవ తీసుకుంటున్నట్లు ఆర్కే తేల్చారు.
మొత్తానికి జాతీయ రాజకీయాల కోణంలోనే.. కేసీఆర్.. జగన్ ను దగ్గరకు తీస్తున్నారన్న విషయం మాత్రం.. ఆర్కే దాదాపుగా ప్రతీ వారం క్లారిటీ ఇస్తున్నారు. జగన్ కు వచ్చే సీట్లు కలుపుకుని… వైసీపీ సీట్లు కూడా టీఆర్ఎస్ సభ్యులుగానే లెక్కలేసుకుని ఆయన జాతీయ రాజకీయాల్లో ఓ మెట్టు ఎక్కాలన్న ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి మరో దారి లేదన్నట్లుగా… అంగీకరిస్తున్నారన్న అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే నిరూపిస్తున్నాయి.