రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తూ.. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేలా అత్యంత దారుణంగా రాజ్యాంగ సంస్థలను సైతం వాడేసుకుంటున్న ప్రధాని మోడీ తీరుపై.. విపక్ష పార్టీలన్నీ… ఓ రేంజ్లో కోల్‌కతాలో గర్జించాయి. కశ్మీర్‌లోని పీడీపీ నుంచి తమిళనాడులోని డీఎంకే వరకూ.. దాదాపు ప్రతి రాష్ట్రం నుంచి… ఓ పార్టీ అక్కడ ప్రాతిధ్యం వహించింది. అసలు ఫెడరల్ స్ఫూర్తి కోసం పోరాటం అక్కడ కనిపించింది. కానీ.. అదే ఫెడరల్ నినాదం వినిపిస్తున్న కేసీఆర్, జగన్‌లకు మాత్రం.. అక్కడ అలాంటిదేమీ కనిపించలేదు. వారికే కాదు.. వారి వారి పత్రికలకు కూడా కనిపించలేదు.
అంత మంది కలిస్తే సంఖ్యా బలం రాదా..?
“రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలంటే.. సంఖ్యాబలం ఉండాలి. ఏపీలో ఇరవై ఐదు, తెలంగాణలో పదిహేడు మొత్తం నలభై రెండు సీట్లు. ఇంకా కలసి వచ్చే వారిని కలుపుకుంటాం” ఇది జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు జరిపిన చర్చల తర్వాత వెల్లడించిన విషయం. రెండు రాష్ట్రాల ఎంపీల లెక్క 42 అని చెప్పిన జగన్… దాదాపుగా.. వివిధ రాష్ట్రాల్లో ఐదు వందల సీట్లలో ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పార్టీలు హాజరవుతున్న సమావేశానికి ఎందుకు హాజరవలేకపోయారు..?. తను చెప్పిన నెంబర్ల ప్రకారం చూస్తే.. కేసీఆర్‌కు కలిస్తే వచ్చేవి పదిహేడు స్థానాల బలమే. అదే మిగతా విపక్ష పార్టీలు.. ప్రాంతీయ పార్టీలతో కలిస్తే వచ్చేది 500 సీట్ల బలం. మరి జగన్‌కు.. కేసీఆర్ మాత్రమే… బలంగా కనిపిస్తున్నారా..? లేక తనకు కావాల్సింది… రాజకీయ లాభమేనా…?
కేసీఆర్ ఫెడరల్ మాటలకేనా..?
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్న కేసీఆర్ .. కోల్‌కతా ర్యాలీ విషయంలో నిమ్మళంగా ఉండిపోయారు. తాను కలిసిన నేతలందరూ… వెళ్తున్నప్పటికీ.. తాను మాత్రం దూరంగా ఉండిపోయారు. తన ఫెడరల్ ఫ్రంట్‌లో ఇక ఎవరూ కలసి రారని.. కోల్‌కతా ర్యాలీనే కేసీఆర్‌కు క్లారిటీ ఇచ్చి ఉంటుంది. అంటే.. నిజంగా కేసీఆర్ చెప్పుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్.. ఇప్పటికే.. కోల్‌కతాలో సాక్షాత్కరించింది. ఆయన కోరుకుంటున్నది.. రాష్ట్రాల స్వయంప్రతిపత్తే కాబట్టి… కేసీఆర్‌కు నిజంగా అదే అవసరం అయితే.. వేదికపై కాంగ్రెస్ ఉంది.. వేదికపై చంద్రబాబు నాయుడు ఉన్నాడనే కారణాలు చెప్పకుండా సభకు వెళ్లి ఉండేవారు. ఎందుకంటే… అక్కడ జరిగింది బీజేపీకి వ్యతిరేకంగా దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటయిన సభ. అది కేసీఆర్‌కు ఇష్టం లేదు. ఆయన ఫెడరలిజం… బీజేపీతోనే బాగుంటుందని నమ్ముతున్నారు. బయటకు చెప్పకపోయినా అదే నిజం.
ఇక ముసుగులో గుద్దులాటలు లేనట్లే..?
కేసీఆర్ , జగన్ లు.. ఇక ఎంత చెప్పినా… వారి ఫెడరల్ ఫ్రంట్ అనేది మాటలకు మాత్రమేనని.. అంతకు మించిన ఎజెండా ఉందని మాత్రం… కోల్‌కతా ర్యాలీతో క్లారిటీ వచ్చేసినట్లయింది. వారు తమ రాజకీయ అడుగులను.. భారతీయ జనతా పార్టీ వైపే వేస్తున్నారని… తేలిపోయిందని… విమర్శలు పెరగడానికి.. వారి వైఖరే కారణం. నిజంగా ఫెడరల్ స్ఫూర్తి ఉంటే.. కేంద్రం తీరుపై ఇప్పటికే పోరాడి ఉండేవారు. కానీ జగన్, కేసీఆర్‌ల కోరుకుంటున్న ఫెడరలిజం వేరు. అది బీజేపీకి అచ్చి వచ్చిన ఫెడరలిజం. మిగతా వారు కోరుకుంటున్న పెడరలిజం వేరు.
–సుభాష్