‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?’ ప్రశ్నకు ‘బాహుబలి 2’తో సమాధానం లభించింది. కానీ, ‘ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?’ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా లభించడం లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన ప్రభాస్‌పై ఎంతోమంది అమ్మాయిలు మనసు పారేసుకున్నారు. ఈ ఆరడుగుల ఆజానుబాహుడు ఓకే అనాలే గానీ పెళ్లికి ముందుకొచ్చే అమ్మాయిలు ఎందరో. అయితే.. పెళ్లి ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ప్రభాస్ సమాధానం చెప్పడానికి సంశయిస్తుంటాడు. పెదనాన్న కృష్ణంరాజుగారు మాత్రం ఏదో ఒక సమాధానం చెబుతుంటారు. బాహుబలి టైమ్‌లో ఆ సినిమా పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ఆయన చెప్పారు.
బాహుబలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ విజయం సాధించింది. తరవాత మరో రెండు సినిమాలు మొదలుపెట్టాడు ప్రభాస్. ఓ అమ్మాయి మేడలో మూడు ముడులు ఎప్పుడు వేస్తాడనే ప్రశ్నకు సమాధానం మాత్రం లభించలేదు. ఈసారి ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తే ‘సాహో’తో ముడి పెట్టారు కృష్ణంరాజు. ‘సాహో’ పూర్తయిన తరవాత పెళ్లి చేసుకుంటాడని సెలవిచ్చారు. ఈ యేడాది ఆగస్టు 15న ‘సాహో’ విడుదల కానుంది. విడుదలైన వెంటనే పెళ్లి చేసుకుంటాడో? లేదంటే నెక్స్ట్ సినిమా విడుదల వరకూ వెయిట్ చేయమంటారో?