టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి తో ఫెడరల్ ఫ్రంట్ పేరిట పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయమైంది. దీని ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న దానిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి ఒక సువర్ణావకాశం వచ్చిందని, దాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకుంటే ఫలితాలు జనసేన పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
నవ్యాంధ్ర కష్టాలకు కారణం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం:
ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. అందువల్లే ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నది తానొక్కడినే నుండి జగన్ పదేపదే చెబుతున్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి మొదటగా మాట్లాడింది తామేనని, తానే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనీ పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మంచిది అని చెప్పిన చంద్రబాబు కూడా ఎన్నికల ఏడాది యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలి అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా తమతోనే ప్రత్యేక హోదా సాధ్యం అని చెబుతోంది. అయితే ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి అత్యవసరమైనది గా, సంజీవని గా మారడానికి కారణం అడ్డగోలు విభజన. ఇప్పుడు రాష్ట్రానికి అవసరమైన ,ఎన్నికల సమయంలో ప్రధాన అంశంగా మారిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, – వీటన్నింటికీ కూడా మూల కారణం రాష్ట్ర విభజన.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు
ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ దుస్థితికి కారణం అడ్డగోలుగా జరిగిన అశాస్త్రీయ విభజన. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అన్నది నిర్వివాదాంశం. పలు సందర్భాలలో తెలంగాణ నాయకులు సైతం ఒప్పుకున్న అంశం. అయితే అశాస్త్రీయంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో తెలంగాణ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకొని చంద్రబాబు తనకు తానుగా పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అటు తెలంగాణలో ఓట్లు రాలకపోగా, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్తో జత కట్టిన కారణంగా తెలుగు దేశం మీద వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకోక పోయినప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో జతకట్టిన కారణంగా కాంగ్రెస్ పై బాబు తీవ్ర విమర్శలు చేసే అవకాశం లేదు. 2014 సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద, కనీసం రాజధాని కూడా లేకుండా మనలని గెంటేశారు అని విరుచుకుపడిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ ని ఏమీ అనలేని పరిస్థితి.
తెలంగాణ తెచ్చిన కెసిఆర్ తో జగన్ పొత్తు
తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ ఎంత చెప్పుకున్నా, తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ తెచ్చింది తామేనని టిఆర్ఎస్ చెప్పిన వాదన కే మొగ్గు చూపారు. 2014లో కేసీఆర్ ని అధికార పీఠం ఎక్కించారు. అయితే తెలంగాణ ఉద్యమానికి కర్త కర్మ క్రియ అయిన కెసిఆర్ తో ఇప్పుడు జగన్ జతకడుతున్నాడు. అయినప్పటికీ, 2014 సమయంలో గనక ఇలాంటి పొత్తు పెట్టుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చేదో అంత వ్యతిరేకత 2019లో రాలేదు. అంతమాత్రాన కెసిఆర్ తో పొత్తు ని ఆంధ్ర ప్రజలు ఆమోదించినట్టే అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. ప్రత్యర్థులు సరిగ్గా వ్యూహం వేసి టార్గెట్ చేస్తే మాత్రం, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్సిపి పద్మవ్యూహం లో చిక్కుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి.
దీనికి తోడు జగన్ కేటీఆర్ భేటి జరిగిన నాటి నుండి,తెలుగుదేశం నాయకులు గతంలో కేసీఆర్ మాట్లాడిన పరుఫమైన వ్యాఖ్యలు – తెలంగాణ జాగో ఆంధ్ర భాగో, ఆంధ్రా బిర్యాని పేడలా ఉంటుంది, – లాంటి వ్యాఖ్యలు అన్నింటిని పనిగట్టుకుని గుర్తు చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల లో కెసిఆర్ ఆంధ్రుల పట్ల వ్యవహరించిన శైలి కారణంగా గతంలో చేసిన పరుఫ వ్యాఖ్యలని ఇప్పుడు ప్రజలు పట్టించుకోక పోవచ్చు కానీ కెసిఆర్ తనకు తానుగా వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం అది ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే పరిణామం గానే ఉంటుంది. అది కెసిఆర్ తో జత కట్టిన వారి మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కలిగిస్తుంది.
పవన్ కళ్యాణ్ కి సువర్ణావకాశం:
అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ తో చెలిమి చేసి ఇటు చంద్రబాబు, అసలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడమే ఆంధ్రుల ని టార్గెట్ గా చేసుకుని ప్రారంభించిన కేసీఆర్ తో జత కట్టి ఇటు జగన్ – ఎన్నికల సమయంలో తెలంగాణ ఏర్పాటు కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి, ఆ నష్టాన్ని పూడ్చడం గురించి బలమైన వాదనలు వినిపించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ లెక్కన సరిగ్గా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటే పవన్ కళ్యాణ్ కి ఇది నిజంగానే సువర్ణ అవకాశం. అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ ని బలంగా విమర్శిస్తే ఆ ప్రభావం దాని తో జత కట్టిన తెలుగుదేశం మీద, తెలంగాణ విభజన గురించి గట్టిగా జరిగితే ఆ ప్రభావం టిఆర్ఎస్ తో జత కట్టిన జగన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సువర్ణ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఎంతవరకు వినియోగించుకుంటాడు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.