తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ముందుగా, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఉద్దేశించి… పంథా మార్చుకుని మాట్లాడటం వారు నేర్చుకోవాలనీ, ఇచ్చిన హామీలపై ఏంచేస్తారూ అంటూ ఇప్పట్నుంచే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎలా అన్నారు. తమకేం చెయ్యాలో తెలుసనీ, ఇచ్చిన హామీల అమలుకు ఎంతెంత బడ్జెట్ అవుతుందో అవన్నీ తాము లెక్కలు చూసి అమలు చేస్తామనీ, తొందరపడొద్దని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదనీ, ఆ ప్రసంగం పద్ధతిగానే ఉందన్నారు. కాంగ్రెస్ కూడా మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందనీ… ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల ప్రసంగాలు ఎలా ఉంటాయో వారికి తెలియదా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో తమ మేనిఫెస్టో ప్రతిబింబించడం సహజమే అన్నారు.
రాష్ట్రానికి అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పన్నుల వాటా మాత్రమే సక్రమంగా వచ్చిందన్నారు. అంతకుమించి కేంద్రం ఏమీ చెయ్యలేదనీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇయ్యాలంటూ నీతీ ఆయోగ్ చెప్పిన మాటను ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేశారు. అయినా, తెలంగాణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చెయ్యలేదన్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయం, ప్రజా సంక్షేమం, రహదారులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు దాదాపు రూ. 20 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు సీఎం చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అమల్లోకి వస్తుందన్నారు.
కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుండటం కాస్త ఆశ్చర్యంగా ఉంది! ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రంతో ఆయన అత్యంత సన్నిహితంగా మెలిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలాసార్లు కలిశారు. ఆ అంశాలపై కలిశాం, ఈ అంశాలు మాట్లాడామంటూ ప్రకటనలు చేశారు. అంతేగానీ… కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి రాని పరిస్థితిని ఎప్పుడైనా ప్రశ్నించారా..? తెలంగాణకు కేంద్రం ఏదీ ఇవ్వకపోతే… గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో ఎందుకు బలంగా డిమాండ్ చెయ్యలేకపోయారు..? కేంద్రంపై పోరాటం చేసేందుకు ఆ సమయంలో కేసీఆర్ కు అడ్డుపడింది ఎవరు..? ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో… రాష్ట్రానికి దక్కని నిధులు ఇప్పుడే గుర్తొచ్చేసినట్టు మాట్లాడుతున్నారు.