జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు.. ఇష్టమైన రాజకీయ నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. పూలే.. చేగువేరా లాంటి వాళ్లు కాకుండా.. సమకాలిన రాజకీయాలు చేస్తున్న వారిలో… ప్రత్యేకంగా పేర్లు పెట్టి కొంత మంది అంటే ఇష్టం అన్ననేతలు ఉన్నారు. అలాంటి వారిలో ప్రథముడు.. తూర్పు జయప్రకాష్ రెడ్డి.. అలియాస్ జగ్గారెడ్డి. ప్రస్తుతం సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. పవన్ కల్యాణ్‌ను ఆయన కలవడం.. ఆయనను పవన్ కల్యాణ్‌ను కలవడం చాలా సార్లు జరిగింది. అయినప్పటికీ.. జగ్గారెడ్డి.. అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు అనుకూలంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
చంద్రబాబు సీఎం అయితేనే ఏపీకి మంచిదని జగ్గారెడ్డి విశ్లేషించారు. చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడని .. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక చంద్రబాబు ఘనత ఉందని స్పష్టం చేశారు. ఏపీలో తెదేపా, తెలంగాణలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు మంచిదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్.. ఇప్పుడు హోదా అడగడం ఏంటని కూడా.. అనుమానం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి చంద్రబాబుపై అంత నమ్మకం ఎందుకు వచ్చిందో కానీ.. తనను అత్యంత ఇష్టమైన నేతగా పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఏపీలో కీలకమైన రాజకీయం చేస్తున్నా.. గుర్తించకపోవడం విశేషం అనే చెప్పుకోవాలి.
జగ్గారెడ్డి.. దూకుడైన నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో… అప్పటి వరకూ తమకు ఎలాంటి వాదం ఉన్నా.. అందరూ… తెలంగాణ కావాల్సిందేనని నినదించారు. అలాంటి సమయంలో.. జగ్గారెడ్డి.. తనది సమైక్య నినాదమన్నారు. ఒక్క టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీల్లో ఉన్న వారిపై తెలంగాణవాదులు దాడి చేస్తున్న రోజుల్లోనే వారి ముందే.. సమైక్య నినాదం వినిపించారు జగ్గారెడ్డి. అందుకే పవన్ కల్యాణ్ .. జగ్గారెడ్డి అంటే తనకు ఇష్టం అని పలుమార్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో ఓడిపోయినా.. మొన్నటి ఎన్నికల్లో .. టీఆర్ఎస్ వేవ్‌ను తట్టుకుని విజయం సాధించారు. ఆయన ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.