తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఎర్రవెల్లి గ్రామంలో ఉన్న తన ఫార్మ్ హౌస్‌లో చతుర్వేద మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగాన్ని ప్రారభించారు. ఐదు రోజుల పాటు ఈ యాగం జరుగుతుంది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో.. 200 మంది రుత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద యాగశాలలు ఏర్పాటు చేశారు. ఏ పని ప్రారంభించినా…కేసీఆర్ ముందుగా యాగం చేస్తారు. అలా చేయడం వల్ల తన పని విజయవంతం అవుతుందని నమ్ముతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ప్రారభించినప్పటి నుంచి ఆయన యాగాలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ యాగాలు.. తరచూ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించే ముందు కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. అధికారం అందుకున్నారు.
జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కలసి నడిచేందుకు ఇతర పార్టీలు పెద్దగా ముందుకు రావడం లేదు. అందుకే… కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల మనసు మార్చి.. అందరూ ఫెడరల్ ఫ్రంట్ వైపు వచ్చి.. ఫెడరల్ ఫ్రంట్ భారీ సక్సెస్ అయ్యాలా.. ఆయన ఈ యాగం చేస్తున్నారని.. సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ ఐదు రోజుల పాటు యాగంలో పాల్గొనే అవకాశం ఉంది.
200మంది రుత్విక్కులు అత్యంత నిష్టగా చేస్తున్న ఈ యాగ క్రతువును చూసేందుకు ప్రజలను అనుమతించడం లేదని.. చెబుతున్నారు. అయితే చివరి రోజు మాత్రం.. ప్రజలను అనుమతించే అవకాశం ఉంటుందంటున్నారు. గతంలో… ఆయుత చండీయాగం నిర్వహించినప్పుడు.. అందర్నీ ఆహ్వానించారు. ఈ సారి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పాలన మాత్రం.. మరో ఐదు రోజుల పాటు ఫామ్‌హౌస్ నుంచే జరగనుంది.