ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఏపీకి గడచిన ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగంలా మారిందన్నారు కేంద్రమంత్రి నితిన్ గట్కరీ. గత యాభైయేళ్లలో ప్రభుత్వాలు ఆంధ్రాకి ఇచ్చినదానికంటే, గడచిన ఐదేళ్లలోనే ఇచ్చింది ఎక్కువ అని చెప్పారు. విజయవాడలో జరిగిన భాజపా సమావేశానికి గట్కరీ వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదేననీ, కేంద్రం సొమ్ముతోనే, రాష్ట్రం సహకారంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. అంతేకాదు, గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు కూడా అందిస్తామన్నారు.
గతంలో తమకు రాజకీయ భాగస్వామిగా ఉన్నవారే ఇప్పుడు తమను విమర్శిస్తున్నారనీ, మోడీ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారన్నారు గట్కరీ. ఒక స్వతంత్ర సంస్థతో ఆంధ్రాలో ఆర్థిక సామాజిక పరిస్థితులపై సర్వే చేయించాలనీ, గడచిన ఐదేళ్లలో కేంద్రం ఏం చేసిందో ఆ తేడా స్పష్టంగా తెలుస్తుందన్నారు. గత యాభైయేళ్లతో పోల్చుతూ తమ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, విద్యుత్, పారిశ్రామిక అభివృద్ధి, విద్యా సంస్థలు… ఇలా అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. తాను చాలా నమ్మకంతో చెప్తున్నాననీ… గడచిన ఐదు సంవత్సరాలూ ఆంధ్రాకి స్వర్ణయుగం అని మరోసారి చెప్పారు.
విభజన తరువాత ఇచ్చిన హామీలు, చట్టంలో అంశాల అమలు సంగతి మాట్లాడకుండా… గడచిన యాభైయేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి చెప్తామంటూ గట్కరీ మాట్లాడటం విడ్డూరం. అంతేకాదు… గడచిన ఐదేళ్లూ ఆంధ్రాకి స్వర్ణయుగం అనేశారు. ఏరకంగా స్వర్ణయుగం, ఎక్కడ స్వర్ణయుగం.. అదేంటో అంశాలవారీగా విభజించి, విఫులంగా మాట్లాడే ప్రయత్నం ఆయన చేసి ఉంటే బాగుండేది. భాజపా పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి కూడా బహుశా ఇలా వారు మాట్లాడరేమో! కానీ, ఆంధ్రాకి వచ్చి… మోడీ పాలన స్వర్ణయుగం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఇస్తామని చెప్పిన ప్యాకేజీ ఏది, ఇతర రాష్ట్రాలకు కొనసాగిస్తున్న ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఎందుకు ఇవ్వలేదు, కడప ప్లాంటు, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు… వీటిపై గట్కరీ మాట్లాడితే బాగుండేది. ఆంధ్రాకి ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితి భాజపాది. కాబట్టే, అంశాలవారీగా మాట్లాడకుండా… ఇలా స్వర్ణయుగాలంటూ స్పందిస్తున్నారు.