కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజంపేట ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి రెడీ అయ్యారని తేలడంతో.. టీడీపీ నాయకత్వం అక్కడ.. కొత్త నేతల్ని ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. ఓ రకమైన రాజకీయ వాతావరణానికి అలవాటు పడిన కడపలో ఈ సారి ఓ వినూత్న ప్రయత్నం చేయాలనే ఆలోచన టీడీపీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్టప్ కంపెనీ రెడ్ బస్ ను స్థాపించి సక్సెస్ అయిన రాజంపేటకు చెందిన చరణ్ పద్మరాజు.. కొత్తగా రేసులోకి వచ్చారు. ఆయనకు వ్యవసాయం, రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో.. టీడీపీ ముఖ్యనేతలతో టచ్ లోకి వెళ్లారు.
స్టార్టప్ శకంలో… సంచలనం విజయం సాధించిన సంస్థల్లో ఒకటి రెడ్ బస్. అతి చిన్న సంస్థగా ప్రారంభమై.. దాదాపుగా రూ. 8 వందల కోట్లకు రెడ్ బస్ ను అమ్మేశారు వ్యవస్థాపకులు. ఆ సంస్థ వ్యవస్థాపకులుల్లో ఒకరు చరణ్ పద్మరాజు. కడప జిల్లా రాజంపేటకు చెందిన చరణ్.. బిట్స్ పిలానిలో చదువుకుని.. స్నేహితులతో కలిసి రెడ్ బస్ ను స్థాపించారు. ఆన్ లైన్ బస్ టికెటింగ్ స్టార్టప్ లలో ఇది మొదటిది. స్వల్పకాలంలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో… ఓ అంతర్జాతీయ కంపెనీ దాదాపుగా రూ. 800 వందల కోట్లకు నాస్పెర్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం గోఐబిబో కింద ఉంది. అయితే.. అమ్మేసిన తర్వాత కొన్నాళ్లకు… వ్యవస్థాపకులంతా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత చరణ్ పద్మరాజు.. కొన్ని స్టార్టప్ కంపెనీలు ప్రారంభించారు. అదే సమయంలో.. సొంత ప్రాంతం అయిన రాజంపేటలో.. వ్యవసయదారుల కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టాడు.
సొంత ఖర్చుతో అత్యాధునిక వ్యవసాయ పద్దతులతో .. సాగు చేసే విధంగా.. కొన్ని రైతు సంఘాలను ఏర్పరిచాడు. వారికి నెలానెలా ఆదాయం వచ్చేలా చేశారు. దాంతో రాజంపేట ప్రాంతంలో ఆయనకు కొంత పేరు వచ్చింది. అదే సమయంలో చరణ్ పద్మరాజుకు కొంత రాజకీయ నేపధ్యం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున ఓ మండలానికి చరణ్ పద్మరాజు.. కొంత కాలం అధ్యక్షునిగా వ్యవహరించారు. కొత్త తరం రాజకీయ నాయకునిగా చరణ్ పద్మరాజుకు రాజంపేట ప్రజల ఆదరణ దక్కుతుందన్న అభిప్రాయాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే .. చరణ్ పద్మరాజు ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డిలతోనూ చర్చలు జరిపినట్లు సమాచారం. మంగళవారం వారు ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉంది.