ఇప్పటి ప్రేక్షకులకు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. ఓ ఇరవైయేళ్లు వెనక్కి వెళితే… వెంకటేష్‌కి ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’ వంటి విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన దర్శకుడు ఆయన. చిరంజీవి ‘బావగారూ.. బాగున్నారా!’కూ ఆయనే దర్శకుడు. మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ వంటి ప్లాప్ ఇచ్చిందీ ఆయనే. ఓ పదేళ్ల క్రితం బాలకృష్ణ ‘లక్ష్మీ నరసింహ’, చిరంజీవికి ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ హిట్స్ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు.
రెజ్లింగ్ నేపథ్యంలో దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త కుర్రాడు నీలేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘నరేంద్ర’. విశేషం ఏంటంటే… రెజ్లింగ్ సూపర్ స్టార్, ది గ్రేట్ ఖలీ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో నటుడిగా అడుగుపెడుతున్నారు. జయంత్ టాలెంట్ ఇదే. తెలుగు సినిమాకు ఎవరినైనా తీసుకు రాగలడు. నాగార్జున ‘రావోయి చందమామ’లో ఐశ్వర్యా రాయ్ చేత ప్రత్యేక గీతం చేయించాడు. దీపికా పదుకోన్ చేత కూడా ఓ చిత్రంలో ప్రత్యేక గీతం చేయించాడు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు.
పవన్ కల్యాణ్ ‘తీన్మార్’ తరవాత మూడేళ్లు విరామం తీసుకున్న జయంత్ సి. పరాన్జీ ఓ కన్నడ చిత్రం చేశారు. తరవాత మరో మూడేళ్లు విరామం తీసుకుని, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా తెలుగులో ‘జయదేవ్’ చేశారు. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు ‘నరేంద్ర’తో వస్తున్నారు.