ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు రవితేజ. 2018 రవితేజకు అస్సలు కలసి రాలేదు. మూడింటికి మూడూ ఆణిముత్యాల్లాంటి సినిమాలే. నేల టికెట్టు, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ… ఇవి మూడూ డిజాస్టర్లే. ఇంకో ఫ్లాప్ తగిలితే మాత్రం రవితేజ కెరీర్ చరమాంకానికి చేరిపోవడం ఖాయం. అయితే ఎన్ని ఫ్లాపులొచ్చినా తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీకి రవితేజ దాదాపు రూ.10 కోట్లు అందుకున్నాడని టాక్. ఇప్పుడు మాత్రం తన పారితోషికంలో భారీ రిబేట్ ఇవ్వకతప్పడం లేదు.
ప్రస్తుతం `డిస్కోరాజా` అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం కోసం తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకున్నాడని టాక్. రవితేజ ఇంత భారీ డిస్కౌంట్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ఈ చిత్రానికి నిర్మాత రాంతాళ్లూరి ఇది వరకు రవితేజతో `నేల టికెట్టు` తీసి భారీగా నష్టపోయాడు. నేల టికెట్టు ఫ్లాప్ అయినప్పుడే `మీకు మరో సినిమా చేసి పెడతా` అని మాటిచ్చాడు రవితేజ. ఇప్పుడు ఆ మాట ప్రకారం సినిమా చేస్తున్నాడు. మరీ ఫ్రీగా సినిమా చేయలేడు కదా..? పారితోషికం తగ్గించుకోవాల్సివచ్చింది. అందుకోసం రవితేజకు డిస్కౌంట్ ఇవ్వకతప్పలేదు. మరి ఈ ఆఫర్ ఈ ఒక్క సినిమాకేనా, తదుపరి ఒప్పుకునే సినిమాలకు కూడానా అన్నది రవితేజ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.