” ఇప్పటికైనా కలసి పోరాడుదాం.. కలసి పోరాడకపోతే పౌరుషం లేదనుకుంటారు..! ” ఇదీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ఓ లక్ష్యం లేకుండా ఏర్పాటు చేసిన అఖిలపక్ష, మేధావుల భేటీలో పవన్ కల్యాణ్ ఉదయం అన్న మాటలు.
” ఒక్క రోజు ముందు .. ఎజెండా లేకుండా.. అఖిలపక్షం పెడితే ఎందుకు వస్తాం..?” ఇది సాయంత్రం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి అందిన ఆహ్వానంపై..పవన్ స్పందన..!
రెండు ప్రకటనలు ఒకే రోజు వచ్చాయి. ఉదయం .. సాయంత్రం. రెండు.. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. రాజకీయ నాయుకుడు.. ఓపీనియన్ చేంజ్ చేసుకోవచ్చు కానీ.. ఇలా.. దొరికిపోయేలా అభిప్రాయాలు చేంజ్ చేసుకోకూడదు.
అఖిలపక్షం పెట్టాలన్న డిమాండ్లన్నీ ఉత్తుత్తివేనా..?
ప్రత్యేకహోదాపై పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఒక్క పోరాటం చేయలేదు. దానిపై వచ్చే విమర్శలను తిప్పి కొట్టడానికి.. ఆయన తనకు బలం లేదని చెబుతూ ఉంటారు. తన ఒక్కడి బలం సరిపోదని.. అందరూ కలసికట్టుగా పోరాడాలని చెబుతూంటారు. పోరాటయాత్రల్లో చాలా సార్లు ప్రభుత్వం… అఖిలపక్షం పెట్టి.. అందర్నీ కలుపుకుని వెళ్లి పోరాడాలని పిలుపునిచ్చారు. నిజానికి ప్రభుత్వం అంతకు ముందు రెండు సార్లు అఖిలపక్ష భేటీలు నిర్వహించింది. అప్పుడు జనసేన… ఎలాంటి కారణాలు లేకుండా.. కేవలం రాజకీయంగా చూసుకుని ఆ భేటీలకు డుమ్మాకొట్టింది. అలాంటప్పుడు… తను ఆ స్టాండ్ మీదే ఉండాల్సింది. కానీ ప్రత్యేకహోదా పోరాటంలో.. తన వంతు పాత్ర ఎందుకు లేదో చెప్పుకోవడానికి అఖిలపక్ష డిమాండ్ ను తెరపైకి తీసుకు రావడం.. ఎందుకో ఎవరికి అర్థం కావడం లేదు. తీరా ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసే సరికి.,.. అన్న మాటలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. హాజరవబోమని… నేరుగా చెప్పారు. గతంలో తను చేసిన ప్రకటనలకు.. ఇప్పుడు.. తీసుకున్న నిర్ణయానికి ఏమీ సంబంధం లేదని తెలిసి కూడా.. పవన్ .. తననుతాను ఎలా సమర్థించుకుంటారు..?
ఉండవల్లికి ఉన్నదేంటి..? ప్రభుత్వానికి లేనిదేంటి..?
ప్రభుత్వం అధికారికంగా అఖిలపక్షానికి ఆహ్వానం పంపితే… ఒక్క రోజు ముందుగా చెప్పడం.. ఎజెండా లేకపోవడం.. చిత్తుశుద్ధి కనిపించడం లేదని కారణంగా వెళ్లడం లేదని బహిరంగ లేఖ రాయడం… తన పలాయనవాదానికి కారణాలు చెప్పడమేనన్న అభిప్రాయం ప్రజల్లోకి వస్తే..అది ప్రజల తప్పు కాదు. ఎందుకంటే.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎర్పాటు చేసిన.. అఖిలపక్ష సమావేశం ఎజెండా ఏమిటో తెలిసే పవన్ కల్యాణ్ వెళ్లారా..?. సమావేశంలో ఎజెండాను నిర్దేశించి చర్చించారా..? అయితే ఏ తీర్మానం చేశారు..?. అది ఓ టైం పాస్ మీటంగ్. అసలు ఏ మాత్రం ఉపయోగం లేని విధంగా.. విభజన హామీలపై కాకుండా.. ” రాజ్యాంగ విరుద్ధంగా విభజన ” అనే అంశంపై చర్చించాలని ఉండవల్లి పట్టుబట్టారు. అంటే అసలు విషయం పక్కన పెట్టేశారు. దానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. కేంద్రంపై .. ఒత్తిడి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి ఎందుకు డుమ్మాకొట్టడం..! ఎజెండా లేదని.. చెప్పడం ఎందుకు..?. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్షానికి ఎజెండా లేకపోతే.. దాన్ని సమావేశానికి వెళ్లి పవనే సెట్ చేయవచ్చు కదా..? . కేంద్రంపై ఒత్తిడి చేయాలంటే.. వ్యక్తులు చేస్తే సాధ్యం కాదు. ప్రభుత్వమే చేయాలి. ఆ ప్రభుత్వంతో కలిసి పోరాడటం.. రాష్ట్రం కోసం మంచిదే. ఆ మాట పవన్ కల్యాణ్ చాలా సార్లు చెప్పారు. కానీ తాను మాటలే చెబుతానని.. పవన్ కల్యాణ్.. మరో సారి అఖిలపక్ష భేటీకి డుమ్మా ద్వారా నిరూపించారు.
రాజకీయాల్లో మాటలకే ప్రాధాన్యం..! మార్చితే మర్చిపోతారు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బహిరంగ సభల్లో కానీ.. మరో చోట కానీ… అచ్చంగా సినిమా స్క్రిప్టుల్లో ఉండే పదాలతోనే… ప్రసంగాలు చేస్తూంటారు. భావోద్వేగాలు పెంచడానికి ప్రయత్నిస్తూంటారు. ఈ క్రమంలో ముందుగా ఆలోచిస్తారో లేదో.. కానీ.. చాలా వివాదాస్పదమైన వాక్యాలు బయటకు వస్తంటాయి. వాటిని పట్టించుకోకపోయినా.. విధాన పరమైన అంశాల్లో మాత్రం.. పవన్.. తాను చేయదల్చుకున్న వాటిని మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. పదాలు బాగున్నాయి… కదా అని అఖిలపక్ష భేటీలు ఏర్పాటు చేయాలని.. పోరాడకపోతే పౌరుషం లేదనుకుంటారని.. కబుర్లు చెపితే.. చివరికే అవి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అఖిలపక్షం విషయంలో అదే జరిగింది. కాస్త ఆలోచించి.. రాజకీయ ప్రకటనలు.. విధాన ప్రకటనలు చేస్తే… జనసేనకు కాస్త విలువ అయినా మిగిలే అవకాశం ఉంటుంది. లేకపోతే.. “లైట్ తీసుకునే ఖాతా”లో ప్రజలు జనసేనను వేసేయగలరు.