ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల పదో తేదీన ఆయన ఏపీలో పర్యటించబోతున్నారు. అమరావతిలో సభ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. నెల రోజుల కిందటే.. ఎన్నికల ర్యాలీలను ప్రారంభించారు. ప్రణాళికా బద్ధంగా అన్ని రాష్ట్రాల్లోనూ.. సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి ఆరో తేదీనే.. గుంటూరులో ఓ సభ ప్లాన్ చేశారు. అయితే.. మోడీ రాక కారణంగా.. ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాలన్నీ.. మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. చివరికి టీడీపీ అధినేత కూడా ప్రోటోకాల్ ప్రకారం … స్వాగతం పలక కూడదని నిర్ణయించడమే కాదు..టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మోడీ.. ఏపీకి చేసిన అన్యాయంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ కారణంగా… పరిస్థితులు ఏమీ బాగోలేవన్న ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం… ఏపీ పర్యటను మోడీ క్యాన్సిల్ చేసుకున్నారు.
అయితే.. ఇప్పుడు మరోసారి పదో తేదీన.. మోడీ పర్యటనను ఆయన టీం ఏపీలో ఖరారు చేసింది. ఈ సారి ఎన్ని నిరసనలు ఎదురయినప్పటికీ.. కచ్చితంగా. సభ నిర్వహించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. తమిళనాడులో అంతకు మించి నిరసన ఉన్నప్పటికీ.. మోడీ సభను నిర్వహించారు. అయితే..మోడీ తమిళనాడుకు.. అధికారిక పర్యటన కోసం వెళ్లారు. అక్కడ ఎయిమ్స్ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు పైగా అక్కడి అన్నాడీఎంకే ప్రభుత్వం.. బీజేపీకి అనుకూలంగా ఉంది. అయినప్పటికీ.. తమిళనాడులో నిరసనలు మిన్నంటాయి. గో బ్యాక్ మోడీ పేరుతో సోషల్ మీడియా హోరెత్తింది. దీనికి కౌంటర్ గా.. బీజేపీ ఢిల్లీ సోషల్ మీడియా టీం.. తమిళనాడు వెల్కమ్స్ మోడీ పేరుతో.. ట్వీట్లతో హోరెత్తించాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి ఆ పర్యటన బీజీపీ కష్టంగానే మారింది.
ఏపీలో సభలు పెట్టకపోతే పారిపోయారన్న పేరు వస్తుంది కాబట్టి… ప్రధానికి ఉండే ప్రోటోకాల్ , భద్రత ఇతర అంశాల ప్రకారం.. సభను సజావుగా నిర్వహించగలమన్న నమ్మకంతో.. బీజేపీ నేతలు ఉన్నారు. అమిత్ షా కూడా తరచుగా ఏపీకి రాబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే నెల 4న అమిత్ షా పర్యటన ఉంటుందని, మూడు విడతలుగా ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ కార్యకలాపాలను పెంచాలనే పట్టుదలతో ఉంది.