భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు … ఏపీ రాజకీయాల విషయంలో తన నోటి దురుసు అంతా ప్రదర్శిస్తూ ఉంటారు. చంద్రబాబుపై.. టీడీపీపై.. ఆయన అనేక అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించి విమర్శలు చేశారు.. అవన్నీ.. రాజకీయం ఖాతాలోకి పోయాయి. కానీ ఆ ఫ్లోలో ఆయన ఓ తప్పు చేశారు. నేరుగా అసెంబ్లీని… విమర్శించేశారు. ఒకటో తేదీన అసెంబ్లీలో విభజన హామీలపై జరిగిన చర్చ సందర్భంగా.. చంద్రబాబునాయుడు… బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై… ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్న విషయం కళ్ల ముందు కనిపిస్తున్నా.. ఎందుకు వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం.. జీవీఎల్‌కు కోపం తెప్పించింది. అందుకే.. ఆ సమావేశం అయిపోయిన తర్వాత రోజు ఓ ట్వీట్ ద్వారా రెస్పాండ్ అయ్యారు.
అసెంబ్లీలో చంద్రబాబు పిచ్చి పీక్స్‌కి చేరిదంని… ఆయన అసెంబ్లీ రౌడీలా వ్యవహరించారంటూ.. ట్వీట్ పెట్టేశారు. ఓ ముఖ్యమంత్రిని అలా కించపరచడం ఏమిటని… ఆ రోజునే… ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమయింది. కానీ ఎవరూ బయటకు స్పందించలేదు. దానికి కారణం.. అందులో అసెంబ్లీ అంశం ఉండటంతో.. ఆ కోణంలోనే కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం. దాని టీడీపీ నేతలు స్కెచ్ రెడీ చేశారు. ఇప్పుడు నేరుగా… ఆయనకు … సభాహక్కుల నోటీసులు జారీ చేయబోతున్నారు. శాసనసభను, సీఎం చంద్రబాబును కించపర్చే విధంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నోటీసులు ఇచ్చారు. జీవీఎల్ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ కాపీని సభా హక్కుల నోటీసుకు ఎమ్మెల్యే జత చేశారు.
ఇప్పుడు బంతి స్పీకర్ కోర్టులోకి పోయింది. స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. జీవీఎల్‌కు నోటీసులు జారీ చేసి.. అసెంబ్లీ ముందు హాజరు కావాలని ఆదేశించవచ్చు. ఆయనపై ఎలాంటి శిక్ష అయినా విధించవచ్చు. స్పీకర్‌కు ఆ అధికారం ఉంది. కోర్టులు కూడా ప్రశ్నించలేవు. సభలో… సమర్థించడానికి బీజేపీకి ఇద్దరే ఉన్నారు. సంఖ్యాపరంగా నలుగురు అయినప్పటికీ.. ఒకరు రాజీనామా చేసేశారు. కామినేని అసెంబ్లీ వైపు రావడం లేదు. మాణిక్యాలరావు, విష్ణుకుమార్ రాజు మాత్రమే ఉన్నారు. వీరు నోరు తెరిచే పరిస్థితి లేదు. ఇక అండగా ఉంటుందనుకునే ప్రతిపక్షం… రావడం లేదు. ఇక.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా… జీవీఎల్‌కు గడ్డు పరిస్థితే. అయితే.. చివరి సమావేశాలు కాబట్టి . జీవీఎల్ విషయాన్ని .. స్పీకర్ సీరియస్‌గా తీసుకుంటారా లేదా.. అన్నదే కీలకం.