సీబీఐ తీరుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షకు సంఘీభావం తెలపడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోల్ కతా వెళ్లారు. మమతా చేస్తున్న దీక్షలో ఆయనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కేంద్రం వ్యవహరిస్తోందనీ, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ప్రజలు గమనిస్తున్నారనీ, ప్రతిపక్షాలన్నీ ఏకమై సమర్థంగా తిప్పి కొడతాయన్నారు. పాత కేసుల్ని తెరమీదికి తెస్తున్నారనీ, ఎన్నికల ముందే ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.
ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే పాత కేసుల్ని తవ్వి తీస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని పార్టీలపైనా వారు బుదర చల్లే కార్యక్రమం పెట్టుకున్నారనీ, ఆంధ్రాలో ప్రత్యేక హోదా అడిగినందుకు సీబీఐతో ఎంపీలపై దాడులు చేయించారన్నారు. ఎమ్మెల్యేలపై ఈడీతో దాడులు జరిపించారన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పై కూడా అలానే వ్యవహరిస్తున్నారనీ, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే ఇలా అన్ని పార్టీలవారినీ లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. కానీ, సుప్రీం కోర్టు ఇవాళ్ల సరైన నిర్ణయం వెలువరించిందనీ, అరెస్టు చెయ్యొద్దంటూ తీర్పు ఇచ్చిందన్నారు.
కేంద్రానికి రాష్ట్రాలు మర్యాద ఇస్తాయనీ, కేంద్రం కూడా రాష్ట్రాల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. మమతా బెనర్జీ సమర్థవంతమైన నాయకురాలనీ, ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలన్నారు. పశ్చిమ బెంగాల్ లో అన్ని స్థానాలు మమతా గెలుస్తారనీ, జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అవుతారనీ, అందుకే ఆమెను బలహీన పరచాలని వారు చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇతర పార్టీలు కూడా బలపడే అవకాశం లేకుండా చెయ్యాలనేదే వారి కుట్ర అన్నారు. కానీ, పశ్చిమ బెంగాల్ లో మమతకు అండగా ప్రజలున్నారనీ… అన్ని లోక్ సభ స్థానాలను మమతా గెలుస్తున్నారన్న నమ్మకం తనకు ఉందన్నారు చంద్రబాబు నాయుడు. మొత్తానికి, పశ్చిమ బెంగాల్ లో విషయంలో కేంద్రం తాజా వైఖరి… ప్రతిపక్షాల ఐక్యతకు మరో వేదికగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. మమతాకు చంద్రబాబుతోపాటు, భాజపాయేతర పక్షాల నుంచి మద్దతు పెరిగే అవకాశం ఉంది.