ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ అంకెల గారడీగా ఉందంటూ వైకాపా నేతలు విమర్శించారు. ఆ పార్టీ నాయకుడు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ… ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదనీ, ఓటమి బడ్జెట్ అనీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు దగ్గర ఉండటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. మూడు నెలల్లో టీడీపీ ఇంటికి వెళ్లక తప్పదనీ, మూడు నెలల తరువాత రెగ్యులర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డికి బదులు ముందుగానే టీడీపీ ప్రవేశపెట్టినట్టుగా ఉందన్నారు.
జగన్ పథకాలన్నింటికీ ఈ బడ్జెట్ లోనే కేటాయింపులు చేసినట్టుగా ఉందనీ, ఇది వైకాపా బడ్జెట్ లా ఉందిగానీ టీడీపీ బడ్జెట్ కాదని పార్థసారధి విమర్శించారు. ఓటమిని ముందుగా గుర్తించారు కాబట్టే, జగన్ నవరత్నాలను కాపీ చేసి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇది చంద్రబాబు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ అంటూ ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారు.
బడ్జెట్ ను విమర్శించే అర్హత ప్రతిపక్ష పార్టీగా వైకాపాకి ఉందా అనేది కొంతమంది ప్రశ్న..? ప్రజలపై బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలకి వెళ్లి, బడ్జెట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కొంత అర్థవంతంగా ఉండేది. కనీసం, ఈ చివరి సమావేశాలకైనా వైకాపా ఎమ్మెల్యేలు హాజరై ఉంటే… ప్రతిపక్ష పార్టీ నేతలుగా కొంతైనా తమ బాధ్యతను నిర్వర్తించారని అనుకోవచ్చు. బడ్జెట్ పై అభ్యంతరాలు ఉంటే సభలో మాట్లాడాలిగానీ, ఇలా ప్రెస్ మీట్లు పెడితే ఏం ఉపయోగం..?
ప్రతిపక్ష పార్టీగా వారు సాధించిన విజయాలను… అధికార పార్టీ నిర్ణయాల్లో ఈ మధ్య వైకాపా వెతుక్కునే విఫలయత్నం చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే… అవి జగన్ పథకాలంటారు! వెనకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే… అవీ జగన్ దగ్గర కాపీ కొట్టినవే అంటారు. చివరికి, కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నల్లచొక్కా వేసుకున్నా… అది కూడా జగన్ నుంచి కాపీ కొట్టిందే అని వ్యాఖ్యానించారు. ఈ కాపీల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న చర్చ ప్రజల్లో ఓ పక్క జరుగుతూ ఉంటే… ఇప్పుడు ఏకంగా ఈ బడ్జెట్ జగన్ బడ్జెట్ లా ఉందని అంటున్నారు. వైకాపా నేతల్లో అధికార యావ ఎంత తీవ్రంగా ఉందని చెప్పడానికి పార్థసారథి వ్యాఖ్యలే సాక్ష్యం. ప్రతిపక్ష పార్టీగా వారు సాగించిన పోరాటాలు, ప్రజల తరఫున నిలబడ్డ సందర్భాలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకోలేని బేలతనాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా నయం… జగన్ పాలన మొదలైపోయిందనలేదు, సంతోషం.