ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనను వ్యతిరేకించి.. నిరనస వ్యక్తం చేయకపోతే.. వారు ఆంధ్రద్రోహులే అని.. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఢిల్లీలో తీర్మానించారు. ఏపీలో బీజేపీ, వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు.. మోడీ పర్యటనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. మోడీ భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కాబట్టి.. బీజేపీ నేతలు ఎలాగూ… నిరసన వ్యక్తం చేయరు. మరి బీజేపీ, వైసీపీ విధానం ఏమిటి..? వారు మోడీ పర్యటనను స్వాగతిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా..? రఘువీరా కోటాలో.. ఆంధ్ర ద్రోహుల పార్టీల ఖాతాలో చేరిపోబోతున్నారా..?. నిజానికి ఇప్పటికీ.. ఈ రెండు పార్టీలు మోడీ పర్యటనపై.. తమ స్పందన వ్యక్తం చేయడం లేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు. మౌనం అర్థాంగీకారం అనే అర్థంలో రాజకీయం నడిపించేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ స్ట్రెయిట్ రాజకీయం కాదు కాబట్టి.. ఆ పార్టీ.. ఎలాంటి ప్రకటన చేయదు. వ్యతిరేకంగా అసలు ప్రకటన చేయలేదు. కానీ.. మోడీ.. విబజన హామీలపై మాట్లాడాలని కూడా డిమాండ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి.. పొరుగు రాష్ట్రం హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలకు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి… మోడీ సభ ఫెయిల్ కాలేదని చెప్పించడానికి తమ క్యాడర్ ను.. ఆ సభకు పంపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నేరుగా కాకపోయినా…మరో విధంగా.. మోడీ సభకు..వైసీపీ సహాయసహకారాలు అందిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదన్న ఆసక్తికరంగా మారింది. కనీసం సోషల్ మీడియాలో అయినప్పటికీ.. ఆయన మోడీ పర్యటనపై తన స్పందన తెలియజేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్.. మోడీపై తిరగబడ్డారు. ఘాటు పదజాలంతో.. ప్రత్యేకహోదా సభలు పెట్టారు. కానీ.. అసలు సమయానికి వచ్చే సరికి చల్లబడిపోయారు. మోడీపై అమితమైన అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిటకు వ్యవహారం వచ్చింది. ఇప్పుడు కూడా.. బీజేపీ, మోడీపై తన విధానాన్ని స్పష్టంగా ప్రకటింకపోతే.. బీజేపీ ఖాతాలోనే ప్రజలు వేసే అవాకశం ఉంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారోననని జనసేన వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఏ స్పందనా వ్యక్తం చేయకుండా ఉంటే.. అది రాజకీయం కాదు. కీలకమైన పరిణామాలు ఉన్నప్పుడు.. స్పందనలు వ్యక్తం చేయకపోతే .. ప్రజల దృష్టిలో యాక్టివ్ గా లేని పార్టీగా ముద్ర పడిపోతుంది.