వరుసగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ, వెనువెంటనే అమలు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పెన్షన్లు డబుల్ చేసి వృద్ధులకు, భృతి ప్రకటించి నిరుద్యోగులుకు, పసుపు కుంకుమతో మహిళలకు, గృహాలు నిర్మించి ఇచ్చి పేద కుటుంబాలకు… ఇలా దాదాపు అన్ని వర్గాల వారికీ ప్రభుత్వం నుంచి వరుసగా సంక్షేమ పథకాల లబ్ధి అందుతోంది. అయితే, రైతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపక్క తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ఇస్తోంది. కేంద్రం కూడా తాజాగా రైతులకు సాయం ప్రకటించింది. ఈ రెంటికి భిన్నంగా, రైతులకు మరింత ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఉంటుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రతిపక్ష పార్టీలతోపాటు, పక్క రాష్ట్రాలు కూడా ఏపీ ప్రకటన కోసం కొంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది.
రైతుల సాయం అంశమై ఈ నెల 13న ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. 11న అక్కడ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మర్నాడు రాష్ట్రపతిని కలవనున్నారు. 13న ఏపీ క్యాబినెట్ భేటీ ఉంటుంది. ఈ సమావేశంలో రైతుల సాయమై ప్రకటన వెల్లడించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, 14 లేదా 15న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. కాబట్టి, ఆలోపుగానే నిర్ణయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే, వీలైనంత త్వరగా ప్రకటించి… దాని అమలును కూడా వెంటనే చేసేందుకు చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
రైతులకు ఏ విధంగా సాయం అందించాలనే అంశంపై ప్రభుత్వం దగ్గర మూడు రకాల ప్రతిపాదనలు ఉన్నట్టుగా సమాచారం. హెక్టారుకు ఫలానా ఇంత అనే విధంగా సాయం అందించాలా, ఎకరానికి ఇంత అనే చొప్పున ఇవ్వలా, లేదంటే రైతు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని… ఎంతో కొంత మొత్తాన్ని ఫిక్స్ చేసి, ఆర్థిక సాయం వెంటనే అందించాలా…. వీటిలో ఏవిధంగా సాయం అందించాలనే అంశమై ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఏదేమైనా, తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన సాయం కంటే… రైతులకు మరింత మేలు చేకూర్చే నిర్ణయమే చంద్రబాబు తీసుకుంటారని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ నిర్ణయం వెలువడ్డాక ప్రతిపక్షాల విమర్శలూ, వారి కొత్త హామీలు ఎలా ఉంటాయో చూడాలి.