తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై మరికొన్ని రోజులు ఆలస్యం కాబోతోంది. కేసీఆర్ ముహుర్తాల నమ్మకంతో ఈ రోజు మంచి ముహుర్తం.. వసంత పంచమి.. ఇక విస్తరణే అనుకున్న మీడియా, ఆశావహులకు షాక్ తగిలింది. విస్తరణ ఈ రోజు లేదని తేలిపోయింది. ఓ దశలో కేసీఆర్ ఎర్రవెల్లిలో చండీ యాగం తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. యాగం ముగిసింది మాకు ఇక ఆమాత్య మోగమేనని చాలా మంది ఆశావహులు సంతోషపడ్డారు. అందుకోసం ముహూర్తాలు…తేదీలు…తిధులుపై కూడా చర్చసాగింది. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కావటంతో ఆ తేదీనా క్యాబినెట్ విస్తరణ చేస్తారని ప్రచారం చేసుకున్నారు. అయితే ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేసారు. ఫిబ్రవరి ఆదివారం పదోతేదీనా పంచని తిధి.. మాఘ మాసం మంచిరోజని ఆరోజున క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంతా బావించారు కాని ఆ ఛాయలేవి కన్పించడం లేదు.
కేసీఆర్ తీరు.. ఆయన వ్యూహాలు ఎవరికి అంతుబట్టడం లేదు. ఆదివారం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందులో ఆరు నుంచి ఎనిమిది మందికి స్థానం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎవరికీ సమాచారం వెళ్లలేదు. కేసీఆర్ నుంచి ఏ క్షణం పిలుపు వచ్చిన అందుబాటులో ఉండాలని సీనియర్లు, మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్ లో మకాం వేసి కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లేదా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి తేదీలు నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలకు సన్నద్దం అవుతున్నారు సిబ్బంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోపే ఖచ్చితంగా మంత్రి వర్గ కూర్పు చేస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఈనెల 14 తర్వాత కేంద్రం నుంచి ఆర్దిక సంఘం అధికారులు వచ్చి వెళ్తారు.ఆ తర్వార మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి.
మొత్తానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో పాటు మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్న ఆశావాహులుతో చర్చించినట్టు చెబుతున్నారు. కానీ అసలు ఘడియలు మాత్రం రావడం లేదు. దాదాపు రెండు కావస్తున్నా కేవలం ఒక మంత్రితో పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్ తీరుపై ప్రతి పక్షాల నుంచి విమర్శులు వస్తున్నాయి..ఇంకా ఆలస్యం అయితే ప్రతిపక్షాలు విమర్శలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది.