`బాహుబలి` తరవాత ఆ స్థాయి చిత్రం తీయాలని తలపెట్టిన కథానాయకుల్లో విక్రమ్ ఒకరు. పురాణ ఇతిహాసగాథ మహాభారతంలో కర్ణుడి పాత్ర ఆధారంగా ఆయన `కర్ణ` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధంతో `కర్ణ` చిత్రీకరణ మొదలుపెట్టాడు విక్రమ్. తెరపై ఈ యుద్ధం అరగంట వుంటుందని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఎస్ విమల్ చెప్పారు. సినిమాలో ఈ యుద్ధం హైలైట్ అవుతుందని ఆయన అంటున్నారు. కర్ణుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ `కర్ణ` కథ, స్క్రీన్ ప్లే రూపొందించారు. ఇప్పుడు హైదరాబాద్లో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రణభూమిలో యుద్ధ రథంతో విక్రమ్ అడుగుపెట్టిన సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమాలో విక్రమ్ లుక్ సీక్రెట్ గా వుంచాలని దర్శకుడు భావిస్తున్నారు. పలువురు స్వదేశీ నటీనటులు, విదేశీ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో రూపొందుతుంది. ఇతర భారతీయ భాషల్లో అనువదించాలని అనుకుంటున్నారు.