ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో రోజంతా దీక్ష చేయబోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ దీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం అధికారికంగా.. కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సందర్భాలు అరుదు. ఈ దీక్షతో.. కేంద్రంలో కదలిక వస్తుందో రాదో కానీ.. ఎన్నికలకు ముందు… మోడీని ఢీకొట్టడనికి.. ప్రత్యామ్నాయం ఉందని.. విపక్షాలకు.. ఐక్యంగా నిరూపించుకునే అవకాశం మాత్రం వస్తోంది. కాంగ్రెస్ సహా పలు జాతీయపార్టీల నేతలు చంద్రబాబు దీక్షకు సంఘిభావం తెలియచేయనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ ప వార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాతోపాటు ఇతర ప్రతిపక్షాల ముఖ్యనేతలు, ప్రతినిధులు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించే అవకాశముందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీక్ష ద్వారా ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాష్ట్రప్రభుత్వం, టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటం, ప్రధాని గుంటూరు వచ్చినా.. హోదా, హామీల పై స్పందించకపోవడం, దీనిపై ఆంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చంద్రబాబు దేశ ప్రజలకు తెలియజేస్తారు. కేంద్ర నిర్లక్ష్య వైఖరిని వివరిస్తారు.
దీక్ష అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పిస్తారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున దీక్ష కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఇలా వచ్చిన వారి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వారికి 800 గదులు, 60 బస్సులు, ఆహార ఏర్పాట్లు చేశారు.