తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరి దృష్టి ఖమ్మంపై పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే.. మహాకూటమికి ఆధిక్యం కనిపించింది. మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు. ఖమ్మం జనరల్. ఈ స్థానం కోసం.. సీనియర్ నేతలంతా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘోర ఓటమిని చవిచూసిన హస్తం పార్టీ ఖమ్మం జిల్లాలో మాత్రం సత్తా చాటింది. ఖమ్మం లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఒక్క ఖమ్మం నియోజక వర్గం నుంచి మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గెలుపొందారు. ఇక వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఇక మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ప్రజాకూటమి ఎమ్మెల్యేలే గెలుపొందారు.
జాతీయ రాజకీయాల కారణంగా కాంగ్రెస్, టీడీపీ మైత్రి లోక్ సభ ఎన్నికల్లోనూ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. దాంతో ఇప్పుడా టికెట్ ఆశిస్తోన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విజయశాంతి ఖమ్మంలో పోటీ చేయాలంటూ ఆ జిల్లాకు చెందిన పలువురు నేతలు ఇటీవల సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు. విజయశాంతి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన గాయత్రి గ్రానైట్స్ అధినేత రవి కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు రాకపోయినా పర్వాలేదు ఇతరులకు రాకూడదు అనుకున్న వారు.. ఏకంగా రాహుల్ గాంధీని రేసులోకి తెస్తున్నారు. రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రచారంలోకి వస్తోంది. చివరికి అంబర్ పేట కాంగ్రెస్ నేత వీహెచ్ కూడా.. తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ఉబలాట పడుతున్నారు.
అయితే ప్రజాకూటమి కంటిన్యూ అయితే టీడీపీ కూడా ఖమ్మం స్థానం కోసం పట్టుబట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో టీడీపీ గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ఉండటం వల్ల ఆ పార్టీ తమకే కావాలని కోరొచ్చు. టీడీపీ తరపున పోటీకి నామా నాగేశ్వరరావు సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి ఆయన అసెంబ్లీ టిక్కెట్ అడగలేదు. కానీ.. బలవంతంగా పోటీ చేయించారు. పార్లమెంట్‌కు పోటీ చేయాలని.. గత ఎన్నికల తర్వాత నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడూ.. మరింత ముమ్మరం చేశారు.