తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తాత్కాలిక బడ్జెట్ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అవసరమయ్యే నిధులపై అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. సుమారు రెండు లక్షల కోట్లకు బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టారు. ఆసరా పెన్షన్లు పెంచుతామని 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు ఏడాదికి ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
ఆర్థిక శాఖ కొన్ని కీలకమైన పథకాలకు ఎన్ని నిధులు అవసరమో లెక్క తేల్చిందని అధికారులు చెబుతున్నారు. ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటివరకు ఏడాదికి 6,600 కోట్లు ఖర్చవుతోంది. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో పెన్షన్లు రెట్టింపు చేయడం వల్ల వచ్చే ఏడాది నుండి 13,200 కోట్లు అవుతుంది. అయితే పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 57 ఏళ్ల కు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను గుర్తించి ఈ ఏప్రిల్ నుండి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితా ఆధారంగా 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను లెక్కిస్తున్నారు. అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10 నుండి 13 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.దీంతో ఆసరా పెన్షన్ లలో 57 ఏళ్లు నిండిన వారిని కూడా కలిపి నిధులు కేటాయిస్తున్నారు. అన్నీ కలిపితే ఆసరా పెన్షన్ లకు ఏడాదికి 15 వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిసింది.
ఆర్థిక శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం రైతుబంధు పథకానికి 15 వేల కోట్లు అవసరమని తేలింది. లక్ష లోపు రుణాల మాఫీకి 24 వేల కోట్లు అవసరమని గుర్తించారు. అయితే రుణమాఫీ కి అవసరమైన నిధులను గతంలో లాగా నాలుగు దఫాలుగా చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక చేస్తున్నారని తెలిసింది.. నిరుద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ప్రభుత్వం వద్ద లేదు. నిరుద్యోగుల లెక్కలు లేకుండా ఈ పథకానికి నిధులు కేటాయించ లేమని ఆర్థిక శాఖ చెప్తోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య తేలే వరకు నిరుద్యోగ భృతి పథకానికి నిధుల కేటాయింపు ఉండదు. కేటాయింపులు లేకుండా పథకాన్ని ఎలా అమలు చేస్తారో ప్రభుత్వానికే తెలియాలి.