హాస్య నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఓ మంచి పనికోసం నడుం బిగిస్తున్నారు. రొటీన్‌కు కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తూ, తమకున్న క్రేజ్‌ను డబ్బుగా మార్చాలనుకుంటున్నారు. ఆ మొత్తాన్ని ఓ మంచి పనికోసం వినియోగించాలని భావిస్తున్నారు. ఇంతకీ వారిద్దరూ ఎందుకు కలిసినట్టు అంటే… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా `మిఠాయి`. ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం జరగనుంది. మామూలుగా ఆడియో వేడుకలంటే సింపుల్‌గా యూనిట్ సమక్షంలో, ఎవరో గెస్ట్ ని పిలిచి చేసుకుంటారు. క్రేజ్ ఉన్న స్టార్లైతే అభిమానులకు ఫ్రీ పాస్‌లు పంచుకుంటారు. కానీ ప్రియదర్శి, రాహుల్ కలిసి తమ ఆడియో వేడుకకు టిక్కెట్ పెట్టారు. ఆ వచ్చే మొత్తాన్ని వసూలు చేసి డిప్రెషన్ అవేర్నెస్ ఫండ్ కి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆశా హాస్పిటల్‌తో టయ్యప్ అయి డిప్రెషన్ అవేర్నెస్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న వీరిని ఇప్పటికే తోటి నటీనటులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.