ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం.. ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు.. అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకు.. బాపూఘాట్లో.. మహాత్మునికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభంలో మాట్లాడిన చంద్రబాబు… మోడీకి.. ఇంకా మూడు రోజుల సమయం ఉందని.. ఈ లోపు పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆ తర్వాత చంద్రబాబు దీక్షకు సంఘిభావం తెలిపేందుకు… బీజేపీయేతర పార్టీల నేతంలదరూ తరలి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదట్లోనే వచ్చారు. యాత్రకు సంఘిభావం తెలిపారు. మోడీ .. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా లూటీ చేశారని మండి పడ్డారు. చంద్రబాబు పోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రత్యేకహోదా హామీని పార్లమెంట్లో ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వచ్చారు. తాను పార్లమెంట్లో ప్రధానిహోదాలో ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత మోడీపై ఉందన్నారు. అలాగే.. ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్ సహా… పలువురు జాతీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. తమ మద్దతు తెలియజేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున.. ఎంపీ డెరిక్ ఓబ్రెయాన్ హాజరయ్యారు్. మమతా బెనర్జీ.. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి సంఘిభావం తెలియజేశారు.
చంద్రబాబు దీక్ష.. ఢిల్లీలో.. ఓ రకంగా… రాజకీయ కలకలం రేపుతోంది. బీజేపీయేతర పార్టీల నేతలందరూ సంఘిభావం తెలియజేస్తూండటంతో.. జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇస్తోంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు కూడా.. ఈ దీక్షను నిశితంగా పరిశీలిస్తున్నారు. జాతీయ మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చేలా…జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చానళ్లతో.. చంద్రబాబు.. ఈ దీక్షల కోసం చేసిన ఖర్చులంటూ.. కొన్నింటిని హైలెట్ చేశారు. మరో చానల్లో… చాయ్ వాలా అంటూ ప్లకార్డులు ప్రదర్శించి.. చాయ్ వాలాలను అవమానించారంటూ… కాస్త హడావుడి చేసి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున చేస్తున్న దీక్ష కావడంతో.. పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. పెద్ద ఎత్తున ఏపీ నుంచి వివిధ ప్రజాసంఘాలు, పార్టీల కార్యకర్తలు రావడంతో.. దీక్ష ప్రాంగణం కిటకిటలాడుతోంది.