విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు… ఏపీ ప్రజల్ని.. తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్నంత ఆగ్రహం.. ఇప్పుడు బీజేపీపై ఉంది. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. అలాంటి పార్టీపై.. ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే.. పోరాటమే మార్గం. అందుకే..ఐటీ, ఈడీ దాడులు జరిగినా… సీబీఐ కూడా పంజా విసరబోతోందని ప్రచారం జరిగినా… చంద్రబాబు .. పోరాటానికే మొగ్గు చూపాశారు. ఈ విషయంలో గత ఏడాదిగా.. బీజేపీపై ఆయన విరుచుకుపడుతున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన దగ్గర్నుంచి.. మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఇప్పుడు… రాజకీయంగా ఉపయోగపడుతోంది. ఏపీ సమస్యల కోసం… చంద్రబాబు గళమెత్తితే… బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు తప్ప.. దేశంలోని అన్ని పార్టీలు.. అడగకుండానే మద్దతివ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఏపీ భవన్ ధర్మపోరాట దీక్షలో జరిగింది ఇదే. వీరందరి మద్దతు కారణంగా.. ఏపీ విభజన సమస్యలు, బీజేపీ చేసిన మోసం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది.
అదే సమయంలో.. జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని చూపడమే కాదు.. కూటమి విషయంలో.. తాను అత్యంత కీలకం అని నిరూపించారు. ఇప్పటి వరకూ.. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని .. కనీసం.. అన్ని పార్టీల్ని ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం అయినా చేయాలని చూశారు. కానీ.. ఇతర నేతలకు ఉన్న పరిమితుల వల్ల అది సాధ్యం కాలేదు. కానీ చంద్రబాబు మాత్రం.. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం దగ్గర్నుంచి.. అత్యంత ప్రణాళికా బద్దంగా… రాజకీయ కార్యక్రమాల్ని నిర్మించుకుంటూ వచ్చారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. మోదీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలసి వస్తున్నారు.
మోదీకి వ్యతిరేకంగా.. అందర్నీ ఏకం చేయడమే కాదు.. సొంత రాష్ట్రంలో చంద్రబాబు అడ్వాంటేజ్ సాధిస్తున్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ స్థాయిలో పోరాడుతూంటే… జగన్, పవన్ ఎక్కడ అనే ప్రశ్నలను ప్రజల్లో లెవనెత్తగలుగుతున్నారు. జగన్, పవన్ లకు ఉన్న పరిమితులేమిటో కానీ.. వారు ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారు.
ఏపీలో ప్రతిపక్ష పార్టీలు కనీసం ప్రశ్నించడానికి కూడా జంకుతున్నాయి… తాను మాత్రం.. నేరుగా ఢిల్లీకి వెళ్లి మోదీకి సవాల్ చేస్తున్నానని చంద్రబాబు ప్రజలకు నిరూపించుకోగలగుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే.. అది ఢిల్లీ స్థాయిలో జరగాలి. అలా జరగాలంటే.. జాతీయ పార్టీల మద్దతు అత్యవసరం. ఆ మద్దతు మొత్తం తెలుగుదేశం పార్టీకి ఉందని.. చంద్రబాబు నిరూపించగలిగారు. ఈ విషయంలో.. జగన్ పూర్తిగా వెనుకబడిపోయారు. ప్రత్యేకహోదా అంశంపై ఓటింగ్ జరిగితే… ఎవరు ఇస్తారు, ఎవరు తెస్తారన్న అంశాన్ని ఓటర్లు బేరీజు వేసుకుంటారు. అసలు ఇవ్వనే ఇవ్వబోమంటున్న బీజేపీకి.. దగ్గరగా ఉంటున్న వైసీపీ ఈ విషయంలో మైనస్ అయిపోతుంది. సరిగ్గా ఇలాంటి రాజకీయ పరిస్థితుల్ని సృష్టించడానికే.. చంద్రబాబు ప్రయత్నించారు. తిప్పికొట్టలేక వైసీపీ డీలా పడింది. ఓ రకంగా వైసీపీని సెల్ఫ్ గోల్ చేసుకునేలా చేశారు.