టాలీవుడ్ మరో దర్శకుడ్ని కోల్పోయింది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన స్వగృహంలో బాపినీడు తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా 19 చిత్రాల్ని తెరకెక్కించారు బాపినీడు. అందులో చిరంజీవి, శోభన్ బాబు చిత్రాలే ఎక్కువ ఉన్నాయి. గ్యాంగ్ లీడర్, ఖైది నెం 786 సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. చిరంజీవితో బాపినీడుకి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. దర్శకుడిగా ఆయన ఆఖరి చిత్రం ఫ్యామిలీ. 1994 తరవాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టలేదు. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.