రఫెల్ డీల్ విషయంలో బారీ స్కాం జరిగిందనడానికి రోజుకో ఆధారం బయటకు వస్తోంది. ఒప్పందానికి ముందు.. నేరుగా.. అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రితో సమావేశమైన విషయం తాజాగా వెలుగు చూసింది. అసలు ఒప్పందం గురంచి రక్షణ మంత్రికే ముందుగా తెలియదు కానీ.. అనిల్ అంబానీకి తెలుసని.. దీనికి సంబంధించిన ఆధారాలను రాహుల్ బయటపెట్టారు. రాఫెల్ ఒప్పందంపై సంతకాలు జరగక ముందే దీని గురించి రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీకి తెలుసునని ఆయన పేర్కొన్నారు. మోదీనే దీన్ని అనిల్ కు తెలియచేశారని .. అధికార రహస్యాలు లీక్ చేయడం దేశ ద్రోహమని… రాహుల్ స్పష్టం చేశారు. అవినీతి, చర్చల ప్రక్రియ, దేశ భద్రతను పణంగా పెట్టడం సహా ఈ వ్యవహారంలోని మొత్తం మూడు అంశాలపై విచారణ జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అసలు రాఫెల్ పై డీల్ ఉంటుందో లేదో… ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే వరకూ ఎవరికీ తెలియదు. అయితే ప్రధాని పర్యటనక కంటే ముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రితో సమావేశం అయ్యారు. 2015 మార్చి 28న పంపిన యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్‌బస్‌కి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ పంపిన ఈ మెయిల్లో… నాటి ఫ్రాన్స్ రక్షణ మంత్రి సహాయకుడితో తాను ఫోన్లో మాట్లాడినట్టు ఉంది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి కార్యాలయానికి అనిల్ అంబానీ వెళ్లారనీ… ప్రధాని పర్యటనలో సంతకం చేయాల్సిన ఎంవోయూ సిద్ధమవుతోందని ఫ్రాన్స్ మంత్రి సహాయకుడు తనతో చెప్పారని ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ ఆ ఈమెయిల్లో రాశారు. వాస్తవానికి 2015 ఆగస్టు 10న ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఎంవోయూ గురించి ప్రకటించారు. దసో ఏవియేషన్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనేందుకు భారత్ సుముఖంగా ఉందని వెల్లడించారు.
ఎంవోయూ గురించి అనిల్ అంబానీకి తెలియడం అంటే… కచ్చితంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇది కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు… ఇది రాజద్రోహం కేసు కూడా అని..మోడీ మధ్యవర్తిగా మారిపోయారని.. మండిపడ్డారు విచారణ జరగాల్సిందేనని.. డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ ఆరోపణలపై.. బీజేపీ ఆచితూచి స్పందించింది. ఆ ఈమెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ డీల్.. రఫెల్ కు సంబంధించినది కాదనే వాదనను.. న్యాయశాఖ మంత్రి తీసుకొచ్చారు. బీజేపీ సైతం సమర్థించుకోలేనంతగా.. రఫెల్ డీల్ లో ఒక్కో విషయం బయటకు వస్తూండటంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది.