కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరుతున్నారు. నిజానికి, ఆయన కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు తప్పదనే ఊహాగానాలు కూడా ముందుగానే వినిపించాయి. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాననీ, త్వరలో టీడీపీలో చేరుతున్నానని కిశోర్ చంద్రదేవ్ ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. తాను అరకు పార్లమెంటు సీటు ఆశించి పార్టీలో చేరడం లేదనీ, బేషరుతుగా టీడీపీలో చేరుతున్నా అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడటానికి చాలా కారణాలున్నాయన్నారు కిశోర్ చంద్రదేవ్. నాలుగైదేళ్లుగా చాలా కారణాలున్నాయనీ, ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనమైపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభావం లేదని తెలిసి కూడా పార్టీకి కట్టుబడి గత ఎన్నికల్లో పోటీ చేశాననీ, ఓడిపోతానని ముందే తెలిసినా కాంగ్రెస్ కోసం నిలబడ్డానన్నారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో ఉన్నా… రాష్ట్రంలో పార్టీ బలపడే అవకాశాలు లేవన్నారు. ఇటీవలే తాను కోట్ల సూర్యప్రకాశరెడ్డితో మాట్లాడానన్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు కిశోర్ చంద్రదేవ్. టీడీపీకి భవిష్యత్తు లేదనుకుంటే తాను ఎందుకు చేరతా అంటూ ఆయన చమత్కరించారు.
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి మిగులున్న ఆ కాస్త ఉనికిని కూడా కోల్పోయే వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా మిగులున్న సీనియర్లు కూడా తమదారి చూసుకుంటున్నారు. అయితే, ఆంధ్రాలో ప్రత్యేక హోదా హామీ ఒక్కటే కాంగ్రెస్ కి కొత్త జవసత్వాలు ఇచ్చేస్తుందన్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరా అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ధీటైన పోటీ ఇచ్చే స్థాయిలో నిలబెట్టాలంటే హైకమాండ్ కూడా ఏపీ విషయంలో చొరవ తీసుకోవాలి. కానీ, ఆ చొరవ కనిపించడం లేదు. దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి ఉంటూ వచ్చిన నాయకులు పార్టీ విడిచి వెళ్లిపోతుంటే, వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఏమాత్రమూ జరగడం లేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎన్నికల నాటికి ఎలా ఉంటుందనేది అర్థమౌతూనే ఉంది.