ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైకాపా నేతలకు వ్యూహాత్మకత కొరవడుతోంది. యథారాజా తథా పత్రిక అన్నట్టుగా సాక్షి పత్రిక కూడా అధినేతకి మౌత్ పీస్ గా మాత్రమే వ్యవహరిస్తోంది తప్ప, మార్గదర్శి పాత్ర పోషించలేకపోతోంది. ఈ మధ్య ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా… ‘అది మేం తీసుకోవాలనుకున్న నిర్ణయమే, మాదే కాపీ కొట్టేశారంటూ’ వైకాపా నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవారం కిందట టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే… అది జగన్ బడ్జెట్ లా ఉందని అనేశారు. అదే పరాకాష్ట అనుకుంటే… ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంపై కూడా సాక్షి అక్కసు వెళ్లగక్కింది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై ముందుగానే అసహనం వ్యక్తం చేసేస్తోంది!
‘నేడు మళ్లీ ఎన్నికల కేబినెట్’ అంటూ ఓ కథనం రాసింది సాక్షి. దీన్లో సారాంశం ఏంటంటే… 35 రోజుల్లో వరుసగా నాలుగుసార్లు మంత్రివర్గ సమావేశాలను ముఖ్యమంత్రి నిర్వహించడాన్ని ఏదో తప్పు అన్నట్టు రాశారు! ప్రజలను మభ్యపెట్టే నిర్ణయాలను తీసుకునేందుకే కేబినెట్ సమావేశాలను సీఎం నిర్వహిస్తున్నారట. కేబినెట్ మీటింగులపై మంత్రులు, కొంతమంది అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట! ఆ అసహనపరులు ఎవరో కూడా రాస్తే ఈ కథనానికి కొంతబలం ఉండేది, ‘పలువురు’ అని దాటేశారు. ఇక్కడి నుంచి కథనం వేరే టర్న్ తీసుకుందండోయ్. మంత్రివర్గంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ జగన్ నుంచి కాపీ కొట్టినవట. జగన్ ప్రకటించిన పథకాలనే చంద్రబాబు ఆమోదిస్తున్నారట!
అసలూ… ప్రతిపక్షంలో ఉన్నవారు పథకాలను ప్రకటించగలరా..? హామీలను పథకాలంటారా..? వాటిని కూడా పాలనాపరమైన నిర్ణయాలు అన్నట్టుగా ఓ పత్రిక ప్రజలకు చెబుతుండటాన్ని ఏ తరహా పాత్రికేయం అని అభివర్ణించాలో అర్థం కావడం లేదు!! ఇంకోటి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్నిసార్లైనా కేబినెట్ నిర్వహించుకుంటుంది. ఆ సమావేశాలపై అక్కసు వెళ్లగక్కుతున్న తీరును ఏమనాలి..? సాక్షి తీరు చూస్తుంటే ఎలా ఉందంటే…. ప్రతిపక్ష పార్టీ కూడా ఆంధ్రాలో పరిపాలన చేస్తోందేమో అన్నట్టుగా ఉంది. ఆ పత్రిక దృష్టిలో జగన్ కూడా చంద్రబాబుకు సమాంతరంగా ఏదైనా ప్రభుత్వం నడుపుతున్నారనే భ్రమలో ఉన్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రికి సమాన స్థాయిలో జగన్ కూడా తన నిర్ణయాలను అమలు చేస్తుంటే… తమకు క్రెడిట్ దక్కకుండా ఎవరో అడ్డుకుంటున్నారనే మానసిక స్థితిలో సాక్షి ఉంది. ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటంటే… ప్రజల తరఫున నిలబడి పోరాడటం. ఆ బాధ్యతను జగన్ ఎప్పుడో వదిలేశారు. ఒక పత్రికగా దాన్ని జగన్ కు గుర్తుచేయడంలో సాక్షి కూడా తన బాధ్యతను వదిలేసింది!
కేబినెట్ సమావేశంపై కాకుండా, అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో లోపాలుంటే సాక్షి ప్రశ్నించొచ్చు. పెన్షన్ రెండింతలు చేయడం తప్పు అవుతుందా..? పసుపు కుంకుమ పథకం అమలు తప్పా, కొన్ని కులాల ఫెడరేషన్లను కార్పొరేషన్లు చేయడం తప్పా, పేదల ఇళ్ల నిర్మాణానికి సాయం ప్రకటించడం తప్పా… ఇలా అంశాలవారీగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించగలిగితే ప్రజలు కొంతైనా హర్షిస్తారు. అంతేగానీ, కేబినెట్ సమావేశం జరగుతుంటేనే ఉలికిపాటుకి గురౌతుంటే ఎలా..?