‘వినయ విధేయ రామ’ పంచాయితీ ఇంకా నలుగుతూనే ఉంది. బోయపాటి నుంచి 5 కోట్లు తిరిగి రాబట్టడానికి డి.వి.వి దానయ్య పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే బోయపాటి కూడా పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. పారితోషికంలో రూ.5 కోట్లు వెనక్కి ఎందుకు ఇవ్వాలో దానయ్య కారణాలు చెబుతుంటే, ఎందుకు ఇవ్వకూడదను అనడానికి బోయపాటి కూడా గట్టి కారణాలే వెదుకుతున్నాడు.
అసలింతకీ ‘వినయ విధేయ రామ’ అనేది ఫ్లాప్ కాదని, అది హిట్టు సినిమా అని బోయపాటి వితండవాదం చేయడం ఈ పంచాయితికి వచ్చిన పెద్దల్ని సైతం విస్మయపరుస్తోంది. ”నేను హిట్టు సినిమానే తీశాను. వసూళ్లు బాగా వచ్చాయి. కావాలని మా సినిమా ఫ్లాప్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారు” అని వాదిస్తున్నాడట బోయపాటి. అసలు తనని అడక్కుండా చరణ్ అభిమానులకు ఉత్తరం ఎలా రాస్తాడు? అది నన్ను అగౌరవపరిచినట్టు కాదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నాడని సమాచారం. ఓ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన దర్శకుడు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఏ చట్టంలో ఉందన్నది బోయపాటి లాజిక్కు. ఇది వరకు దానయ్య తీసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, ఆయా దర్శకులంతా డబ్బులు వెనక్కి ఇవ్వలేదని గుర్తు చేస్తున్నాడట.
అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం 5 కోట్లతో ముడిపడి ఉన్నది కాదు. ఇది ‘ఈగో’ సమస్యగా మారింది. బోయపాటి నుంచి డబ్బులు తిరిగి రాబట్టాల్సిందే అని దానయ్య, ఇవ్వకూడదని బోయపాటి గట్టిగా పట్టుక్కూర్చున్నారు. ఎవరు తగ్గినా.. పరువు పోతుందని భయపడుతున్నారు. అందుకే… ఈ సమస్య మరింత జటిలంగా మారింది. పెద్ద మనుషులుగా కూర్చున్న వాళ్లు సైతం `ఈ గొడవ మేం తేల్చలేం.. మీరో మీరు ఓ నిర్ణయానికి రండి` అంటున్నార్ట.