ప్రధానమంత్రి మోడీ బడ్జెట్ లో ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకం సాయం పొందడానికి తెలంగాణలో సగం మంది రైతులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ రకాల నిబంధనలతో వారిని ఎలిమినేట్ చేసి పడేశారు. కేంద్ర కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు కోసం నెలాఖరులోగా రాష్ట్రాల వారిగా జాబితా పంపాలని కేంద్రం కోరుతోంది. దీని కోసం తెలంగాణా వ్యవసాయ శాఖ కేంద్ర రైతు పథకం లబ్ధి దారుల జాబితా సిద్ధం చేస్తోంది. వీరు లెక్కలు తీసేకొద్దీ.. రూల్స్ అమలు చేస్తూంటే.. మొత్తం జాబితా తేలిపోతోంది. కేంద్ర పథకం నిబంధనల ప్రకారం తెలంగాణాలో సగానిపైగా రైతులు అనర్హులే ఉన్నారు. రైతుబంధు పథకం లెక్కల ప్రకారం తెలంగాణాలో మొత్తం 52 లక్షల మంది రైతులు ఉన్నారు. రెండు హెక్టార్ల లోపు రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు దశల్లో చెల్లిస్తామని కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకం ప్రకటించింది. అంటే ఐదెకరాల లోపు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. దీని ప్రకారం ఐదు ఎకరాల లోపు రైతులు 47 లక్షల మంది ఉన్నారు..
అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 47 లక్షల మందిలో 30లక్షల మంది రైతులు ఈ పథకానికి అనర్హులుగా తేలుతున్నారు. నిబంధనల ప్రకారం ఐదు ఎకరాలలోపు ఉన్న రైతుల్లో ఒక కుటుంబం నుండి ఒకరికే వర్తిస్తుంది…భార్య,భర్తల ఇద్దరి పేర్లపై వేర్వేరుగా భూమి ఉంటే ఒకరికే ఇస్తారు అది కూడా ఇద్దరికి కలిపి ఐదెకరాలు దాటకూడదు. కుటుంబ పెద్దతో పాటు మైనారిటీలో ఉన్న పిల్లల పేర్ల మీద కలిపి ఐదెకరాల లోపు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఉమ్మడి కుటంబంలో ఒకరికే ఇవ్వాలన్న నిబంధన ఉంది. దీనిని గుర్తించేందుకు రేషన్ కార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పది వేలకు పైగా పెన్షన్ పొందే వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ఈ పథకం వర్తించదు.
కేంద్ర రైతు పథకం సవాలక్ష నిబంధనలతో తెలంగాణలో రైతుల అర్హుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. దాదాపు 30 లక్షల మంది అనర్హులుగా తేలుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ సంఖ్య కేంద్ర పథకం లబ్ధిదారుల జాబితా 17లక్షలకు మించకపోవచ్చని చెప్తున్నారు. అంటే.. తూ.. తూ మంత్రంగానే రైతులకు కేంద్ర సాయం అందబోతోంది.