తెలంగాణ కేబినెట్ విస్తరణ… ఎప్పుడో ఏంటో ఎవ్వరికీ తెలియని పరిస్థితి! ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటిపోయినా మంత్రి వర్గ కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకూ దృష్టి సారించలేదు. ఆశావహులు కూడా నీరుగారిపోయే పరిస్థితి! అదిగో ఇదిగో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేస్తున్నారు అంటూ గత రెండు నెలలుగా గుసగుసలు వినిపించడమే తప్ప… సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు వెలువడలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మరోసారి మంత్రి వర్గ విస్తరణ అంశం తెరమీదికి వచ్చింది. కారణం.. త్వరలోనే తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో ఇప్పుడు కొంతమంది మంత్రుల అవసరం ఉంది! ఆ దిశగానే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఇదే అంశమై గవర్నర్ నరసింహన్ తో ఈరోజు కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఓ పదిమందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆ పదిమంది జాబితా కూడా ఆయన సిద్ధం చేసుకున్నారట. కేబినెట్ కూర్పుపై గవర్నర్ తో చర్చించి, వీలైనంత త్వరగా… అంటే, మరో మూడు లేదా నాలుగు రోజుల్లోనే మంత్రులు కొలువుదీరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పదిమందిలోనూ ఎక్కువగా కొత్తవారికే అవకాశం ఉంటుందని సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా.. కొన్ని కీలక శాఖల్ని కలిపి ఒక శాఖగా మార్చాలని కూడా ఓ కసరత్తు జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన నివేదికల్ని సీఎంకి చీఫ్ సెక్రటరీ అందించారనీ అంటున్నారు. అంటే, విస్తరణకు సంబంధించి కసరత్తు పూర్తయిందనే చెబుతున్నారు.
ఈ నెల 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి 25వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలుంటాయి. కాబట్టి, ఈలోగానే కీలక శాఖలకు మంత్రులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిజానికి, గత సమావేశాలను మంత్రుల్లేకుండానే వెళ్లదీశారు. కానీ, ఇప్పుడు రాబోతున్నది బడ్జెట్ సమావేశం కాబట్టి… మంత్రితో బడ్జెట్ ప్రవేశపెట్టిస్తేనే బాగుంటుందని కేసీఆర్ నిర్ణయించారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఆ పదిమంది మంత్రుల జాబితాలో కూడా కేటీఆర్, హరీష్ రావులకు అవకాశం ఉండకపోవచ్చనే అంటున్నారు. విచిత్రం ఏంటంటే… ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటుతున్నా… మంత్రుల్ని కేసీఆర్ ఏర్పాటు చేయకపోవడం. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మంత్రి అవసరం కాబట్టి, అందుకే విస్తరణ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే, మంత్రి వర్గానికి ఉండాల్సిన ప్రాధాన్యతను ముఖ్యమంత్రే తక్కువ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు.