ఆరు, ఎనిమిది, పది… తెలంగాణ మంత్రి వర్గంలో భర్తీ కానున్న బెర్తుల సంఖ్యపై ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా 18 మందికి అవకాశం ఉన్న క్యాబినెట్ లో ఇప్పుడు జరగబోతున్న విస్తరణలో ఎంతమంది మంత్రులను భర్తీ చేస్తారనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా ఎలాంటి లీకులూ ఇవ్వడం లేదు. విచిత్రం ఏంటంటే… కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రకటించినా కూడా ప్రగతిభవన్ లోగానీ, తెరాస భవన్ లోగానీ దానికి సంబంధించిన చర్చ జరగడం లేదు. 19న విస్తరణ ఉంటుందని అంటున్నారే తప్ప… ఎవరికి పదవులు వస్తాయనే ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపించడం లేదు.
కేబినెట్ లోని తీసుకుంటున్నవారి వివరాలను కూడా ముందుగా వెల్లడించరనీ, చివరికి మంత్రులు కాబోతున్న ఆ ఎమ్మెల్యేలకు కూడా ముందుగా సమాచారం ఇవ్వరట! 19వ తేదీ తెల్లారుజామున… అంటే, ప్రమాణ స్వీకారం చేసేందుకు కొన్ని గంటల ముందు మాత్రమే వారికి సీఎం కేసీఆర్ స్వయంగా చెబుతారనీ, అప్పుడు కూడా మీడియా ముందుకు వెళ్లకుండా నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్, మహమూద్ అలీలను మినహాయిస్తే 16 మందిని భర్తీ చేసే అవకాశం ఉంది. వీరిలో గరిష్టంగా పదిమందిని మాత్రమే భర్తీ చేస్తారని ఇప్పుడు ఊహాగానాలు వస్తున్నా… అంతకంటే ఎక్కవ సంఖ్యలో మంత్రుల్ని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయమూ వినిపిస్తోంది.
కేబినెట్ విషయంలో మరీ ఇంత ఉత్కంఠ అవసరమా…? మంత్రి వర్గ విస్తరణ గురించి మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చాక మీడియాకు వెల్లడించకూడదు, ముందుగా సమాచారం ఇవ్వకూడదు… ఇలాంటి కండిషన్లు పెట్టడం వల్ల ఏం ఉపయోగం? ప్రభుత్వం కొలువుదీరి ఇప్పటికే రెండునెలలు దాటిపోయింది. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంపై చాలా విమర్శలున్నాయి. ఇప్పుడు అరకొరగా జరుగుతున్న విస్తరణకు కూడా ఇంత బిల్డప్ అవసరమా అనేది కొంతమంది ప్రశ్న..? కేబినెట్ కూర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఆశావహులలోనే లేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా… మంత్రి వర్గ ఏర్పాటుకు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.