`క్యాస్టింగ్ కౌచ్`పై కొత్తగా చెప్పేది ఏముంది? కొన్ని నెలలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలకు కారణమైంది. ప్రముఖ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలుగమ్మాయి… కథానాయిక లయ స్పందించారు. “అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ వుండేదని, చిన్నస్థాయిలో జరిగేదని విన్నాను. సాఫ్ట్వేర్, కార్పొరేట్, హాస్పిటల్… ఇలా అన్ని రంగాల్లో అమ్మాయిలను లోబరుచుకోవాలనుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతుతార అనేది“ లయ మాట. సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదన్నారు.
యూట్యూబ్ మీడియాపై లయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు హీరోయిన్ బయటకు వెళితే ఎవరు షూట్ చేస్తారో, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమని రాస్తారో తెలియదన్నారు. లయ మాట్లాడుతూ “ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇస్తే నా తెలుగు బాలేదని రాశారు. నా మాట తీరే అంత. కొన్నేళ్లు వేరే ప్రాంతంలో వున్నప్పుడు యాస కాస్త మారడం సహజం. అసలు తెలుగు ఎంతమంది స్పష్టంగా మాట్లాడుతున్నారు? ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎంతోమంది ఎన్నో బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళను ఎందుకు నిలదీయరు? అమ్మాయిలంటే అంత లోకువా? ఎంతోమంది అమ్మాయిలను ఇలాగే అల్లరి చేస్తున్నారు. ఫేస్బుక్లో ఫ్యామిలీ ఫొటో పోస్ట్ చేయాలన్నా భయంగా ఉంటుంది. సోషల్ మీడియా వల్లే ఇదంతా. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయకూడదని నా అభిప్రాయం“ అన్నారు.