ఎన్నికల ప్రకటనకు ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఈ మేరకు… టీడీపీ నేతలు క్లారిటీఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత, నామినేషన్లకు ముందు అభ్యర్ధుల జాబితా ప్రకటించడం మంచిది కాదని, దీని వలన నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల్లో పధకాల వలన సానుకూల ధృక్పధం వచ్చిందని, ఈ సమయంలో అభ్యర్ధులను కూడా ముందుగానే ప్రకటిస్తే నియోజకవర్గాలలో ప్రచారం చేసుకుంటే ఫలితం వన్ సైడ్ గా ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుల ఆందోళనకు ఓ కారణం ఉంది. చంద్రబాబు అభ్యర్ల ఎంపికను.. నామినేషన్ల చివరి తేదీ వరకూ సాగదీస్తారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో అది మంచిది కాదనేది.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల భావన.
చంద్రబాబు కూడా.. అభ్యర్ధుల ఎంపిక పై పార్టీ వర్గాలతో పాటు, వివిధ రకాల సర్వేలను కూడా తెప్పించుకుని మదింపు చేస్తున్నామని, ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాలపై అవగాహనకొచ్చామని, షెడ్యూల్ కు ముందే ప్రకటిస్తామని వారికి తెలిపారు. ఈ విషయం మీడియాకు కూడా చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. దాంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ కు ముందే అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తామని, మెజారిటీ అభ్యర్ధులు ఈ జాబితాలో ఉంటారని వివరించారు. షెడ్యూల్ తరువాత కొంతమంది అభ్యర్ధులను మాత్రమే ప్రకటిస్తారని వివరించారు.
నిజానికి టీడీపీ అభ్యర్థులపై చంద్రబాబు ఎప్పుడో ఓ అవగాహనకు వచ్చారని.. అసంతృప్తులను బుజ్జగించడానికి.. వలసలను నిరోధించడానికి అధికారిక ప్రకటన చేయడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల అభ్యర్థుల కొరత ఉంది. టీడీపీ నేతలు వస్తే.. చేర్చుకోవడానికి ఆ పార్టీ రెడీగా ఉంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు జాబితాను ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ వ్యవహారాల్ని టీడీపీ అధినేత ఎంత వరకు సర్దుబాటు చేసుకుంటారో.. ఎంత వేగంంగా.. అభ్యర్థుల్ని ప్రకటిస్తారో వేచి చూడాలి..!