తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయ పార్టీ ఆర్భాటం.. మాటలకే పరిమితమయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని.. రజనీకాంత్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తమ లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలేనని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జయలలిత మరణం తర్వాత.. తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు… అనేక మంది పోటీ పడుతున్నారు. జయలలిత పార్టీ అన్నాడీఎంకే.. జనాకర్షణ ఉన్న నేత లేరు. శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆ పార్టీ దాదాపుగా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయారు. టీటీవీ దినకరన్‌ను బయటుక గెంటేశారు. ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు… పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతుల్లోనే అన్నాడీఎంకే నడుస్తోంది. కానీ ఆ పార్టీకి భవిష్యత్ ఉందని ఎవరూ నమ్మడం లేదు. ఈ సమయంలో రజనీకాంత్‌కు మంచి అవకాశాలుంటాయన్న ప్రచారం జరగడంతో.. ఆయన రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. అభిమానులందరి కోసం ఓ వేదిక కూడా ఏర్పాటు చేశారు. కానీ.. రాజకీయ కార్యాచరణపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పుడల్లా పార్టీ పెట్టరని.. తమిళనాట ప్రచారం జరిగింది.. దానికి తగ్గట్లుగానే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రకటిచారు.
మరో సూపర్ స్టార్.. కమల్ హాసన్ మాత్రం.. తన “మక్కళ్ నీది మయ్యం” పార్టీ అన్ని స్థానాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన .. కార్యాచరణ కూడా రెడీ చేసుకుంటున్నారు. కమల్ హాసన్ డీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని ప్రచారం జరిగింది కానీ… కానీ ఆయన తోసి పుచ్చారు. సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. రజనీకాంత్ మాత్రం.. అసలు లోక్‌సభ ఎన్నికల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.