వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి… ముఖ్యమంత్రిని చేస్తే.. ఐదేళ్లలో బీసీల కోసం రూ. 75వేల కోట్లు ఖర్చు చేస్తామని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రకటించారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో.. అనేక వరాలు ప్రకటించారు. ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ తీసుకు వచ్చి… ఏడాదికి 15 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఐదేళ్లలో బీసీల కోసం 75 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. బీసీ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం. ప్రతి ఒక్క బీసీ కులానికిఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామన్నారు. తెలంగాణలో 32 కులాలను.. బీసీ జాబితాలను తొలగించడంపై… కూడా స్పందించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇలానే ప్రకటించారు. కానీ.. తర్వాత మర్చిపోయారు.
నామినేషన్ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టులు.. యాభై శాతం బీసీలకు దక్కేలా చట్టంచేస్తానని.. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అలాగే.. నామినేటెడ్ పోస్టులు కూడా యాభై శాతం ఇస్తామని చట్టం చేస్తామన్నారు. సొంత పార్టీలో.. ఒక్క జిల్లాకు కూడా… బీసీ నేతని అధ్యక్షుడిగా పెట్టలేదని.. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీలో ఎంత మంది బీసీలు అగ్రనేతలుగా ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరగడంతో.. మాటలతో చెబితే నమ్మరనే ఉద్దేశంతో.. చట్టం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని కూడా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఆర్టీసీ విషయంలో జగన్ చిత్రమైన ఆరోపణలు చేశారు. లాభాలు వచ్చే రూట్లలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదని ఆరోపించారు. చంద్రబాబు మనుషులైన కేశినేని లాంటి వ్యక్తుల ట్రావెల్ బస్సులు మాత్రమే ఈ రూట్లలో తిప్పుతున్నారని విమర్శించారు. నిజానికి నష్టాలు వస్తున్నాయని కేశినేని బస్సులు అమ్మేసి చాలా కాలం అయింది. ఇప్పుడు కేశినేని ట్రావెల్స్ వ్యాపారం చేయడం లేదు. కానీ… జేసీ బ్రదర్స్ మాత్రమే చేస్తున్నారు. కానీ వ్యూహాత్మకంగా.. ఓ సామాజికవర్గంపై… దాడి చేస్తున్న జగన్.. .జేసీ బ్రదర్స్ గురించి చెప్పకుండా.. బస్సుల వ్యాపారాన్ని ఆపేసిన కేశినేనిని టార్గెట్ చేశారు. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆ కమిషన్కు చట్టబద్దత కల్పిస్తామని హామీ ిచ్చారు.