చిరు – మోహన్‌బాబు.. వీళ్లది భలే జోడీ. టామ్ అండ్ జెర్రీలాంటోళ్లం.. అని చిరంజీవే తమ జోడీ గురించి చెప్పుకున్నారు ఒకప్పుడు. ఇద్దరూ కలిశారంటే ఒకళ్లపై మరొకరు పంచ్‌లు వేసుకుంటుంటారు. బయట ఎలా ఉంటారో తెలీదు గానీ, సినీ వేడుకల్లో మాత్రం ఆప్యాయత టన్నుల కొద్దీ కురిపించుకుంటారు. అలాంటి సంఘటనే సుబ్బరామిరెడ్డి అవార్డు వేడుకలో జరిగింది.
ఆదివారం రాత్రి విశాఖపట్నంలో టీఎస్ఆస్ అవార్డుల కార్యక్రమం జరిగింది. నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబులకు టీఎస్ఆర్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్ని అందించడానికి చిరంజీవి అతిథిగా వచ్చాడు. `నా సోదరులు బాలకృష్ణ. నాగార్జున, మోహన్‌బాబులకు అవార్డులు వచ్చాయి.. నాకే ఏ అవార్డూ రాలేదు` అని చిరు తన ప్రసంగంలో చమత్కరించాడు. అది గుర్తు పెట్టుకున్న మోహన్ బాబు చిరు ప్రసంగం పూర్తయిన వెంటనే `నీకు అవార్డు రాలేదు కదా.. నాకొచ్చిన గురువుగారి అవార్డు నీకే ఇస్తున్నా తీసుకో` అంటూ.. తన శాలువాని చిరంజీవికి కప్పాడు. ఆ పరిణామానికి చిరు షాకైనా, వెంటనే తేరుకుని `ఇద్దరం పంచుకుందాం` అని ఆ శాలువాని.. మోహన్బాబుపైనా కప్పేశాడు.
టీ.ఎస్.ఆర్ అవార్డుల్లో హైలెట్ అయిన దృశ్యం ఇదే. ఒకే వేదికపై చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబులను చూడడం.. వాళ్లంతా ఈ ఫంక్షన్ అయ్యేంత వరకూ వేదికపైనే ఉండడం ఆకట్టుకుంది. ఇలా స్టార్లందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చిన ఘనత మాత్రం సుబ్బరామిరెడ్డిదే.